మహేష్‌ సర్కారు వారి పాటకు విలన్‌గా అనిల్‌కపూర్‌!

సూపర్ స్టార్ మహేష్ బాబు, పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాటలో నటించేందుకు రెడీ అవుతున్నారు. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో మహేష్ ద్విపాత్రాభినయంలో నటించనున్నట్లు వార్తలు వస్తుండగా.. ఈ మూవీకి సంబంధించిన మరో ఆసక్తికర విషయం సినీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ సూపర్‌స్టార్ అనిల్ కపూర్ పేరు వినిపిస్తోంది. ఇటీవల అనిల్‌ని కలిసిన పరశురామ్‌ సర్కారు వారి పాట స్క్రిప్ట్‌ని చెప్పారని, అందులో విలన్ పాత్ర ఆయనకు బాగా నచ్చిందని తెలుస్తోంది. ఇక త్వరలోనే ఈ మూవీ షూటింగ్ కోసం అనిల్ డేట్లు ఇవ్వనున్నట్లు టాక్. ఒకవేళ ఇదే నిజమైతే టాలీవుడ్‌ ప్రేక్షకులు మరో క్రేజీ కాంబోను థియేటర్లలో చూడనున్నారు.

కాగా ఈ సినిమాలో మహేష్‌ సరసన మొదటిసారి కీర్తి సురేష్ జతకట్టబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి థమన్ సంగీతం అందించనున్నారు.