ఎవరెస్ట్ శిఖరంపై కాలుమోపిన ఏపీ యువకుడు అనిమిష్ వర్మ

ప్రపంచ ప్రఖ్యాతి పొందిన పర్వతారోహకులు సైతం ఎవరెస్ట్ ఎక్కనిదే తమ జీవితానికి సార్థకత ఉండదని భావిస్తుంటారు. ఇంతటి సమున్నత పర్వతాన్ని తెలుగు యువకుడు భూపతిరాజు అనిమిష్ వర్మ అధిరోహించి సత్తా చాటాడు. ఎవరెస్ట్ అధిరోహణలో అనిమిష్ కు అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ సాయపడింది. 28 ఏళ్ల అనిమిష్ వర్మ స్వస్థలం విశాఖ. ఈ నెల 1న ఎవరెస్ట్ శిఖరాగ్రం కాలుమోపి తన జీవితకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు.

అనిమిష్ 2017 నుంచి పర్వతారోహణపై ఆసక్తితో కఠిన శిక్షణ పొందాడు. ప్రత్యేక శిక్షణలో భాగంగా లఢఖ్ లో మంచు పర్వతాన్ని అధిరోహించాడు. ఆ సమయంలో ఉష్ణోగ్రతలు మైనస్ 40 డిగ్రీలకు పడిపోయినా అనిమిష్ వెనుకంజ వేయలేదు. అంతేకాదు, గతేడాది ఆఫ్రికాలోని కిలిమంజారో, సౌత్ అమెరికాలోని అకాంగువా పర్వతాలను కూడా అధిరోహించాడు. ఎంబీఏ చదివిన అనిమిష్ కు మార్షల్ ఆర్ట్స్ లోనూ నైపుణ్యం ఉంది. వరల్డ్ కిక్ బాక్సింగ్, కరాటే పోటీల్లో అనేక పతకాలు సొంతం చేసుకున్నాడు.