మరో 38 ఓపెన్‌ జిమ్‌లు.. ఓపెన్‌ జిమ్‌లకు పెరుతున్న ఆదరణ

నగరవాసుల ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ జీహెచ్‌ఎంసీ ఓపెన్‌ జిమ్‌లను ఏర్పాటు చేస్తున్నది. నెలకు వేలల్లో ఫీజులు చెల్లించి దేహదారుఢ్యాన్ని మలుచుకునే పరిస్థితికి దూరంగా రూపాయి ఖర్చు లేకుండా ముఖ్యమైన పార్కుల్లో వ్యాయామశాలలను అందుబాటులోకి తీసుకువచ్చింది. డాక్టర్‌ ఏఎన్‌ రావ్‌ నగర్‌ పార్క్‌, ఇమ్లిబన్‌ పార్క్‌, గుల్‌మోహర్‌ పార్కు, కృష్ణకాంత్‌ పార్క్‌, ఇందిరాపార్క్‌ తదితర 74 చోట్లలో ఔట్‌డోర్‌ జిమ్‌లను అందుబాటులోకి తీసుకురాగా, ఇవి నగరవాసులను ఆకర్షిస్తున్నాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు చేయదగిన అన్ని వ్యాయామ పరికరాలు అందుబాటులో ఉండటంతో స్థానికులు ఆసక్తి చూపుతున్నారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం అటు వాకింగ్‌తోపాటు ఓపెన్‌ జిమ్‌లకు వెళ్తున్నారు.

ఓపెన్‌ జిమ్‌లకు ఆదరణ పెరుగుతున్నది. దీంతో దాదాపు రూ. 2.80కోట్లతో మరో 38 చోట్ల ఏర్పాటు చేసేందుకు చర్యలు వేగిరం చేశారు. ఇందులో భాగంగా తాజాగా ఖైరతాబాద్‌ జోన్‌ పరిధిలోని చాచా నెహ్రూ పార్కు, సనత్‌నగర్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌, ఓయూ కాలనీ తదితర పార్కుల్లో ఓపెన్‌ జిమ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు జోనల్‌ కమిషనర్‌ పి. ప్రావీణ్య శుక్రవారం ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. కాగా దశల వారీగా మరిన్ని పార్కుల్లో ఓపెన్‌ జిమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *