రేపు మరో అల్పపీడనం.. ఏపీపై ప్రభావం

అండమాన్ సముద్రంలో ఈ నెల 13న మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ అల్పపీడనం బంగాళాఖాతంలో ప్రవేశించి ఏపీ వద్ద తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఈశాన్య రుతుపవనాల సీజన్ లో బంగాళాఖాతంలో తరచుగా అల్పపీడనాలు ఏర్పడుతుంటాయి. తాజాగా కొన్నిరోజుల వ్యవధిలోనే 2 అల్పపీడనాలు ఏర్పడ్డాయి. అవి తమిళనాడు, ఏపీపై తీవ్ర ప్రభావం చూపించాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం చేరిన నేపథ్యంలో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తీర ప్రాంతాల్లో కూడా గంటకు 50-60 కి.మీ నుంచి ఈదురు గాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉందని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఏపీలోని తీర ప్రాంతాల్లోని జిల్లాలకు రెడ్‌ అలర్ట్ ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. నేడు, రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.