మరో సంచలన నిర్ణయం తీసుకున్ననిమ్మగడ్డ

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సంఘం కార్యకలాపాలకు ఓ పథకం ప్రకారం విఘాతం కలిగించి, పంచాయతీ ఎన్నికలను అడ్డుకోవడానికి ప్రయత్నించారనే అభియోగాలతో… ఎన్నికల కమిషన్ సెక్రటరీ వాణీమోహన్ ను విధుల నుంచి తొలగించారు. వాణీమోహన్ సేవలు ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో అవసరం లేదంటూ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ కు లేఖ రాశారు. ఈసీ కార్యాలయం నుంచి ఆమెను రిలీవ్ చేశారు. నిన్ననే రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ జేవీ సాయిప్రసాద్ ను కూడా విధుల నుంచి నిమ్మగడ్డ తొలగించిన సంగతి తెలిసిందే.

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులు ఈ నెల 9 నుంచి సెలవులు పెట్టకూడదని, అందరూ అందుబాటులో ఉండాలని నిమ్మగడ్డ రమేశ్ కోరారు. అయినప్పటికీ సాయిప్రసాద్ 30 రోజుల పాటు సెలవుపై వెళ్తున్నట్టు లేఖ పంపారు. అంతేకాదు, ఇతర ఉద్యోగులు కూడా సెలవుపై వెళ్లేలా ఆయన ప్రభావితం చేశారనే ఆరోపణల నేపథ్యంలో నిమ్మగడ్డ తీవ్రంగా స్పందించారు. ఆర్టికల్ 243కే రెడ్ విత్ 324 ప్రకారం తన అధికారాలను వినియోగించారు. ఎన్నికల కమిషన్ నుంచి సాయిప్రసాద్ ను తొలగించారు. అంతేకాదు, ఇతర ప్రభుత్వ సర్వీసుల్లో కూడా ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ విధులు నిర్వహించడానికి వీల్లేదని ఆదేశించారు. తాజాగా మరో ఉన్నతాధికారి వాణీమోహన్ పై వేటు వేశారు.