ఢిల్లీలో మరో వారం లాక్‌డౌన్‌ పొడగింపు?

న్యూఢిల్లీ: ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పరిస్థితి కాస్త మెరుగుపడుతున్నా.. ప్రభుత్వం మరో వారం లాక్‌డౌన్‌ పొడగించే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. భారీగా పెరిగిన రోజువారీ కేసుల మధ్య ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ గత నెల 19న లాక్‌డౌన్‌ విధించారు. ఆ తర్వాత పలుసార్లు పొడగిస్తూ వచ్చారు. చివరిసారిగా ఈ నెల 16న లాక్‌డౌన్‌ పొడగిస్తూ ప్రకటించారు. ఈ నెల 24న ఉదయం 5 గంటలతో గడువు ముగియనుంది. ఢిల్లీలో నిన్న 2,200 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 3.5శాతానికి తగ్గింది.

అయితే, కరోనా కేసులు కాస్త తగ్గినా.. వైరస్‌ నుంచి పూర్తిగా బయటపడినట్లు కాదని.. కట్టడికి మరిన్ని చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ సడలింపులపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌తో చర్చలు జరిపి, నిర్ణయం ప్రకటిస్తామని శుక్రవారం సీఎం తెలిపారు. రెండో వేవ్‌ ప్రాణాంతకమని, అయితే లాక్‌డౌన్‌ సడలింపు అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయని, మరో వారం రోజులు పొడగించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.