ఏరోస్పేస్-డిఫెన్స్ రంగంలో ఏపికి నూతన దిక్సూచి

*లక్ష కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో సీఎం చంద్రబాబు సమీక్ష

రాష్ట్రాన్ని రక్షణ, అంతరిక్ష పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0 (2025–2030)పై సోమవారం సమీక్ష జరిగింది. ఈ కొత్త పాలసీ ద్వారా వచ్చే ఐదేళ్లలో రూ.50 వేల కోట్ల నుంచి రూ.1 లక్ష కోట్ల వరకు పెట్టుబడులు రాష్ట్రానికి రాబట్టే లక్ష్యాన్ని సీఎం స్పష్టం చేశారు. నూతన సాంకేతికత, ఆవిష్కరణల కోసం రాష్ట్రం కేంద్ర బిందువుగా మారేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా ంశంఏ పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహం కల్పించేందుకు రూ.100 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు, లాజిస్టిక్స్ సబ్సిడీ లాంటి అంశాలను పాలసీలో చేర్చాలని సూచించారు. ఎం.ఎస్.ఎం.ఈ ఉత్పత్తులకు నాణ్యతా బెంచ్‌మార్క్, బ్రాండింగ్, విలువ జోడింపు వంటి అంశాలపై ముఖ్యంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. ప్రాంతాలవారీగా పరిశ్రమల ఏర్పాటుపై కూడా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. విశాఖపట్నం-శ్రీకాకుళంలో నావల్ క్లస్టర్, జగ్గయ్యపేట-దొనకొండలో మిస్సైల్, ఆయుధాల ఉత్పత్తులు, కర్నూలు-ఓర్వకల్లు ప్రాంతంలో డ్రోన్లు, మానవ రహిత విమానాల తయారీ, లేపాక్షి-మడకశిరలో ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. తిరుపతిని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్‌గా అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 23 సంస్థలు రూ.22 వేల కోట్ల పెట్టుబడులతో పని చేస్తుండగా, దాదాపు 17 వేల మందికి ఉపాధి లభించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ సమీక్ష సమావేశంలో ఏరోస్పేస్–డిఫెన్స్ సలహాదారు సతీష్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని కీలక సూచనలు చేశారు. మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, టీజీ భరత్, వాణిజ్య పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ సమావేశంలో పాల్గొన్నారు.

Share this content:

Post Comment