జగన్‌ సర్కార్‌ పై ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

న్యాయమూర్తులపై సోషల్ మీడియాల దుష్ప్రచారం చేయడం కుట్రలో భాగమేనని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ కుట్ర వెనక ఎవరు ఉన్నారో తేలుస్తామని చెప్పింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని రోజుల క్రితం కొందరు నేతలు న్యాయవ్యవస్థ గురించి, హైకోర్టు న్యాయవాదుల గురించి విమర్శలు చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం సామాజిక మాధ్యమాల్లో న్యాయవ్యవస్థ ప్రతిష్ట మసకబారేలా అభ్యంతరకరమైన పోస్టులు దర్శనమిచ్చాయి. ఈ పోస్టుల గురించి స్పందిస్తూ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఏపీలో రూల్ ఆఫ్ లా అమలు కాని పక్షంలో అధికారాన్ని వినియోగిస్తామని పేర్కొంది.

రాష్ట్రంలో న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేలా ఎవరైనా ప్రవర్తిస్తే ఊరుకోబోమని వెల్లడించింది. సాధారణ న్యాయమూర్తులపై ఎవరి ప్రభావం లేకుండా ఎవరూ దూషణలు చేయరని వ్యాఖ్యానించింది. ఎవరికైనా హైకోర్టుపై విశ్వాసం లేని పక్షంగా పార్లమెంటుకు వెళ్లి హైకోర్టును మూసేయాలని కోరాలని.. అభ్యంతరకర పోస్టుల వెనుక ఉన్న కుట్రను తేలుస్తామని పేర్కొంది. జడ్జీలను అవమానించే విధంగా పోస్టులు చేయడం సరికాదని వెల్లడించింది. ఆరోపణలు న్యాయమూర్తులపై వ్యక్తమయ్యాయి కాబట్టి హైకోర్టు వ్యాజ్యం దాఖలు చేయవచ్చని అభిప్రాయపడింది. జస్టిస్ జె. ఉమాదేవి, జస్టిస్ రాకేష్ కుమార్ లతో కూడిన ధర్మాసనం అభ్యంతరకర పోస్టుల విషయంలో చాలా సీరియస్ గా స్పందించింది. గతంలో ఈ విధంగా ఎప్పుడూ జరగలేదని పేర్కొంది. న్యాయవ్యవస్థపై నమ్మకం లేకపోతే ప్రతి ఒక్కరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారని అభిప్రాయపడింది.