ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త

ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. మార్చి, ఏప్రిల్ నెల పెండింగ్ జీతాలతో పాటు, పెన్షన్లు, 2 డీఏలు నవంబర్‌లో చెల్లించేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంగీకరించారు. ఈ విషయాన్ని స్వయంగా ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు.

 నిన్న ఏపీ ఎన్జీవో ముఖ్యనేతలు సీఎం జగన్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే. ఆ భేటి అనంతరం చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్, ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయ్యేలోపు ఇంటి స్థలం, కరోనా సోకిన ఉద్యోగులకు 30 రోజుల ప్రత్యేక సెలవు ఇవ్వాలని కోరామని.. వీటన్నింటికి సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.

అలాగే సీపీఎస్, పీఆర్సీ విషయంలో కూడా ముఖ్యమంత్రి సుముఖంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని రకాల సౌకర్యాలు, రాయితీలతో పాటు నాలుగో తరగతి ఉద్యోగుల వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచేందుకు సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.