ఏపీ ఐసెట్‌, ఈసెట్‌ ఫలితాలు విడుదల

ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశానికి సంబంధించిన ఏపీ ఐసెట్‌–2021 ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఈ ఫలితాలను విడుదల చేశారు. మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉదయం 11కి ఫలితాలను విడుదల చేశారు. ఐసెట్‌ ఫలితాల్లో 34,789(91.27శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఈసెట్‌ ఫలితాల్లో 29,904(92.53శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు.విద్యార్థులు ఫలితాల కోసం sche.ap.gov.in లో చూడవచ్చు. ఇందుకు విద్యార్థులు వారి అడ్మిట్‌ కార్డు నంబర్‌, పాస్‌వర్డ్‌ నింపాల్సి ఉంటుంది. సెప్టెంబర్‌ 17, 18 తేదీల్లో విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ ఐసెట్‌ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.

ఇంజనీరింగ్‌ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ విధానంలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన ఏపీఈసెట్‌–2021 (ఏపీ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. జేఎన్‌టీయూ(ఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీఈసెట్‌ ఫలితాల వెల్లడి కార్యక్రమానికి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి హాజరు అయ్యారు. ఏపీఈసెట్‌కు మొత్తం 32,318 మంది విద్యార్థులు హాజరు కాగా, మొత్తం 13 బ్రాంచులకు గాను పరీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా 48 పరీక్ష కేంద్రాల్లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ నిర్వహించారు.