ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్ ను అభివృద్ధి చేయాలి

*ఇండస్ట్రియల్ పార్క్ కు వెళ్ళడానికి ప్రత్యేక బైపాస్ రోడ్డు సదుపాయం కల్పించాలి
*పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను అందించి పరిశ్రమలను అభివృద్ధి చేయాలి
*ఇండస్ట్రియల్ పార్క్ నందు విద్యుత్ హెచ్చుతగ్గులు లేకుండా 33/11 కెవి సబ్ – స్టేషన్ ఏర్పాటు చేయాలి
*ఎమ్మెల్యే బత్తుల

రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ అమరావతి పర్యటనలో భాగంగా సోమవారం పరిశ్రమలు & వాణిజ్య మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ ప్రధాన కార్యదర్శి డా. యన్. యువరాజ్ ఐఏఎస్ ని కలిసి రాజానగరం మండలం కలవచర్ల ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని కోరారు, వీటితో పాటు పలు కీలక విషయాలపై చర్చించడం జరిగింది. ఈ భేటీలో ముఖ్యంగా కలవచర్ల గ్రామంలో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ పార్కు సజావుగా పని చేయడానికి మరియు పరిశ్రమలకు అనుసంధానాన్ని మెరుగుపరచడానికి రహదారి మౌలిక వసతులు అత్యవసరమని పేర్కొన్నారు. ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్ కు వెళ్ళడానికి ప్రత్యేక బైపాస్ రోడ్డు కలవచర్ల ఊరిలోకి రాకుండా పార్క్ వరకు వేయాలని కోరారు. అలాగే ఇండస్ట్రియల్ పార్క్ నుండి గాదరాడ కు కలిసే విధంగా మరొక రోడ్డు వేయాలని కోరారు. ఇండస్ట్రియల్ పార్కు నుండి నందరాడ వరకు సీసీ రహదారి నిర్మాణం చేపట్టాలని, ఇండస్ట్రియల్ పార్కు నుండి గాదరాడ కెనాల్ రోడ్డు వరకు సీసీ రహదారి నిర్మాణం చేపట్టాలన్నారు. ప్రతిపాదిత ఇండస్ట్రియల్ పార్కులో గల ప్లాట్స్ లకు ప్రభుత్వం ఫిక్స్ చేసిన రేట్లు అధిక ధరలు నిర్ణయించారు. ధరలు ఎక్కువగా ఉంటే ఎంఎస్ఎంఈ పరిశ్రమల యజమానులు ముందుకు రావడానికి వెనుకంజ వేస్తారని, ఇది పరిశ్రమ పార్కు స్థాపన ఉద్దేశ్యానికి విరుద్ధంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కాబట్టి రాయితీ ఇవ్వడం వలన వ్యాపారస్తులు ముందుకు వచ్చి పరిశ్రమలు స్థాపించేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందని ప్లాట్ రేట్లను తగ్గించాలని కోరారు. కలవచర్ల గ్రామంలో ఏపీఐఐసీ ద్వారా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ పార్క్‌కు గోదావరి నది నీటిని పోలవరం ఎడమ ప్రధాన కాల్వ ద్వారా అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని పరిశ్రమలు ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు నీటి అవసరం ఎక్కువ ఉంటుందన్నారు.. పోలవరం ప్రాజెక్ట్ లక్ష్యాల్లో పారిశ్రామిక నీటి సరఫరా కూడా ఒక భాగమే కనుక, ఈ నీటిని కలవచెర్ల పరిశ్రమ పార్క్‌కు కేటాయించాలని కోరారు. ఇండస్ట్రియల్ పార్కులో పరిశ్రమలు నిరంతరాయంగా పనిచేయడానికి స్థిరమైన విద్యుత్ సరఫరా చాలా అవసరమని పేర్కొన్నారు..దీని కోసం పరిశ్రమలకు 24/7 నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలని, విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు లేకుండా ఉండేందుకు సెపరేట్ గా 33/11 కెవి సబ్ – స్టేషన్ ఏర్పాటు చేయాలన్నారు. ట్రాన్సఫార్మర్లు, విద్యుత్ స్థంబాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యుత్ అందించాలన్నారు. పై విషయాలపై సానుకూలంగా స్పందించిన పరిశ్రమలు & వాణిజ్య మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ ప్రధాన కార్యదర్శి డా. యన్. యువరాజ్ ఐఏఎస్ వీలైనంత త్వరలో అనుమతులు మంజూరు చేసి, త్వరలోనే నిర్మాణాలు చేపట్టి త్వరగా పూర్తి చేయడానికి సహకరిస్తాను అని హామీ ఇవ్వడం జరిగింది.

Share this content:

Post Comment