పొలంలో నిల్వ ఉన్న వర్షపు నీటిని బయటికి తరలించే ఏర్పాటు చేయండి: జనసేన

అవనిగడ్డ: తుఫాను తీవ్రత తగ్గి మూడు రోజులు అయినప్పటికీ, వరి పొలాల్లో నిల్వ ఉన్నటువంటి వర్షపు నీరు ఇంకా బయటకు పోకపోవడంతో నేలకొరిగినటువంటి వరి పంట నీళ్లలో మునిగి తడిసిపోవడం కారణంగా ధాన్యంకు మొలకలు వస్తుండడంతో రైతు పూర్తిగా నిరాశకు గురవుతున్నాడని, స్థానిక ఎమ్మెల్యే స్పందించి అధికారులను పొలాలలోకి పంపి, వర్షపు నీరు బయటకు పోయే మార్గాలను చూడాలని అవనిగడ్డ జనసేన పార్టీ నేతలు కోరారు. బుధవారం అవనిగడ్డ మండలం రామ కోటి పురం గ్రామం లోని డ్యామేజ్ అయిన వరి పంటను స్థానిక జనసేన నాయకులు పరిశీలించి, జిల్లా కలెక్టర్ నిన్న నియోజక వర్గం లో పర్యటించి, ఎటువంటి హామీ ఇవ్వకుండానే వెళ్లిపోయారని, తక్షణ సహాయం క్రింద ప్రభుత్వం ఎకరాకు 25,000 రూపాయలు ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరారు. ఇప్పటికే చల్లినటువంటి మినుము విత్తనాలు కూడా పూర్తిగా నీటిలో మునిగిపోవడం తో పనికి రాకుండా పోయాయని, కనీసం ఇప్పుడైనా పూర్తి ఉచితంగా మినుము విత్తనాలను వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కోసినటువంటి వరి పంటకు ఇన్సూరెన్స్ రాదని ప్రజలు భయాందోళనలకు లోనవుతున్నారని, ఈ విషయంలో కూడా అధికారులు స్పందించి రైతులకు వివరణ ఇవ్వాలని వారు కోరారు. తేమ శాతం 17 పాయింట్లు కంటే ఎక్కువ ఉన్నప్పటికీ తడిసిన మరియు మొలకలు వచ్చిన మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి, రైతుకు ఊరట కలిగించాలని, అలా చేయని పక్షంలో జనసేన పార్టీ రైతుల పక్షాన పోరాడుతుందని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ మండల జనసేన పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు, ఎంపీటీసీ బొప్పన భాను, కమ్మిలి సాయి భార్గవ, మావూరి కృష్ణయ్య, రేపల్లె రోహిత్, కమ్మిలి వేణు, బచ్చు మురళి, కమ్మిలి రఘురత్న ప్రసాద్, కోసూరి శ్రీనివాసరావు, మాలే గోపాలరావు, కమ్మిలి విజయబాబు, సనకా శ్రీరాములు, శీలం కృష్ణమూర్తి, కమ్మిలి సుబ్బారావు, ఉద్దండి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.