ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు

కరోనా పరిస్థితుల కారణంగా తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు విద్యాశాఖకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన నేపథ్యంలో డిజిటల్‌ తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెప్టెంబర్‌ 1 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. టీశాట్‌, దూరదర్శన్‌ ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధించనున్నారు. ఇప్పటికే ఆయా ఛానళ్లతో విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు ఉపాధ్యాయులంతా ఈనెల 27 నుంచి పాఠశాలలకు హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశించింది.

కరోనా పరిస్థితుల కారణంగా లాక్‌డౌన్‌ తర్వాత ప్రభుత్వ పాఠశాలలు ఇప్పటి వరకు తెరుచుకోలేదు. గత కొన్ని రోజులుగా ప్రైవేటు పాఠశాలలు తమ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తున్నాయి. మరికొన్నాళ్లు విద్యాసంస్థలు తెరిచే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆన్‌లైన్‌ పాఠాలు ప్రారంభించాలని విద్యాశాఖ భావించింది. దీనిపై సుమారు నెలరోజుల క్రితమే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వాటిని పరిశీలించిన ప్రభుత్వం.. తాజాగా ఆన్‌లైన్‌ పాఠాలు చెప్పేందుకు విద్యాశాఖకు అనుమతించింది.