బెయిల్ పై విడుదలైన ఆర్యన్ ఖాన్.. మన్నత్‌ వద్ద జన సందోహం..

క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌కు బెయిల్‌ లభించడంతో ఆర్థర్‌ రోడ్‌ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో కుమారుడిని ఇంటికి తీసుకొచ్చేందుకు షారుఖ్‌ శనివారం ఉదయం మన్నత్‌ నుంచి బయలుదేరి జైలుకు చేరుకున్నారు. ఆర్యన్‌ జైలు నుంచి వస్తున్నాడని తెలిసి షారుఖ్‌ నివాసం మన్నత్‌ వద్దకు అభిమానులు భారీగా చేరుకున్నారు.

ఆర్యన్‌ నిన్న రాత్రి కూడా జైల్లో ఉండక తప్పలేదు..
ఈ ఉదయం 9 గంటలకు జైలు అధికారులు ఆర్యన్‌ బెయిల్‌ పేపర్ల పరిశీలన ప్రారంభించారు. నిబంధనల ప్రకారం అధికారిక కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత మధ్యాహ్నం లోపు ఆర్యన్‌ జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీంతో కుమారుడిని తీసుకొచ్చేందుకు షారుఖ్‌ బయలుదేరారు. నిజానికి ఆర్యన్‌కు గురువారమే హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసినప్పటికీ.. పూర్తి ఉత్తర్వులను నిన్న మధ్యాహ్నం జారీ చేసింది. అయితే అవి సకాలంలో జైలుకు చేరకపోవడంతో ఆర్యన్‌ నిన్న రాత్రి కూడా జైల్లో ఉండక తప్పలేదు.

అక్టోబరు 3 న ఆర్యన్‌ డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అతడికి జ్యుడీషియల్‌ కస్టడీ విధిస్తూ ముంబయి ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో అక్టోబరు 8 నుంచి ఆర్యన్‌ ముంబయిలోని ఆర్థర్‌ రోడ్‌ జైలులో ఉన్నాడు. ప్రత్యేక న్యాయస్థానం బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆర్యన్‌ తరఫు న్యాయవాదులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మూడు రోజుల పాటు విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. ఆర్యన్‌తో పాటు మరో ఇద్దరు నిందితులకు కూడా బెయిల్‌ మంజూరు చేసింది. అయితే ఇందుకు 14 షరతులు విధించింది. రూ.లక్ష పూచీకత్తు సమర్పించాలని ఆదేశించగా.. నటి జూహీ చావ్లా ఇందుకు జామీను ఇచ్చారు. కోర్టు శుక్రవారం వివరణాత్మక బెయిల్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్యన్‌కు విధించిన బెయిల్‌ షరతుల్లో ఎన్‌డిపిఎస్‌ కోర్టు ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని నిషేధం ఉంది. ఆర్యన్‌ పాస్‌పోర్టును కోర్టుకు అప్పగించాలని కోరారు.