ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దుర్గాదేవిగా, మహిషాసురమర్ధినీదేవిగా

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. వివిధ ఆకారాల్లో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. 2020, అక్టోబర్ 24వ తేదీ శనివారం రెండు ప్రత్యేక అలంకారాల్లో దర్శనమివ్వనున్నారు. ఒకే రోజు రెండు తిథులు అష్టమి, నవమి ఉండటంతో రెండు అలంకారాల్లో కనువిందు చేయనున్నారు.

ఉదయం దుర్గాష్టమిని పురస్కరించుకొని దుర్గాదేవిగా, మధ్యాహ్నం నుంచి మహిషాసురమర్ధినీదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. లోకకంఠకుడైన దుర్గమాసురుడిని వధించి దుర్గాదేవీ స్వయంగా కీలాద్రిపై అవతరించినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది.

అష్టబుజాలతో అవతరించి సింహవాహినియై, దుష్టుడైన మహిషాసురుడిని సంహరించింది. అమ్మవారిని దర్శించుకొనేందుకు భక్తులు తరలివస్తున్నారు. కానీ..కరోనా నేపథ్యంలో నిబంధనల ప్రకారం భక్తులను అనుమతినిస్తున్నారు.

ఇదిలా ఉంటే..తెప్పోత్సవ విషయంలో సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్‌ నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఇప్పటి వరకు ట్రయిల్‌ రన్‌ కూడా నిర్వహించేందుకు సాధ్యపడ లేదు. దీనిపై శనివారం తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు ఆలయ ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు పేర్కొంటున్నారు.