సీతగా కృతి సనన్‌.. ఆహ్వానించిన ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ‘ఆదిపురుష్’. రామాయణ నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా కనిపించనుండగా.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావణుడిగా కనిపించనున్నారు. అయితే ప్రభాస్‌కు జోడీగా సీత పాత్రలో ఎవరు నటించనున్నారు అనే దానిపై నిన్న మొన్నటి వరకు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరిగింది. సీత పాత్రలో అనుష్క శర్మ, కీర్తి సురేష్‌ సహా పలువురి పేర్లు వినిపించినా.. చివరికి కృతి సనన్‌ ఆ ఛాన్స్ కొట్టేసింది. ఈ విషయాన్ని స్వయంగా హీరో ప్రభాస్‌ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. అంతేకాకుండా లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్‌ యంగ్‌ హీరో సన్నీ సింగ్‌ నటించనున్నారు. ఈ ఇద్దరిని ఆదిపురుష్‌ టీంలోకి స్వాగతిస్తూ ప్రభాస్‌ ఫోటోలను షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.