అడుగడుగునా సమస్యలు తిష్ట వేస్తే ప్రజాప్రతినిధులు చోద్యం చూస్తున్నారు

* తుని మున్సిపాలిటీయో.. పంచాయితీయో అర్ధం కావడం లేదు
* క్రియాశీలక సభ్యత్వమే ప్రతి కార్యకర్తకు భద్రత, భరోసా
* తునిలో క్రియాశ్రీలక సభ్యుడి కుటుంబానికి రూ. 5 లక్షల చెక్కు అందచేసిన నాదెండ్ల మనోహర్

తుని పట్టణ ప్రజలకు ఇది మున్సిపాలిటీయో పంచాయతీయో అర్ధం కాని పరిస్థితి నెలకొందని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. పట్టణంలో సమస్యలు తిష్ట వేస్తే ప్రజా ప్రతినిధులు చోద్యం చూస్తున్నారన్నారు. కనీసం డంపింగ్ యార్డు సమస్యకు ఏళ్ల తరబడి పరిష్కారం చూపలేకపోయారని తెలిపారు. అడుగడుగునా రోడ్లు, మురుగు కాల్వల సమస్యలు ఉన్నా పట్టించుకునే నాథుడు కరవయ్యాడన్నారు. తుని పట్టణం, 20వ వార్డు ఇసుకలపేటకు చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు శ్రీ వాసంశెట్టి రాజు ఇటీవల సముద్ర స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందారు. బుధవారం శ్రీ రాజు తల్లిదండ్రులు శ్రీమతి అప్పలనరస, లచ్చన్నలను నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. పార్టీ కోసం అహర్నిశలు పని చేసే కార్యకర్త అకాల మరణం చెంది దూరం కావడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆ కుటుంబాన్ని ఓదార్చి పార్టీ క్రియాశీల సభ్యులకు ఇచ్చే రూ. 5 లక్షల బీమా చెక్కును రాజు తల్లికి అందచేశారు. ఎలాంటి సమస్య వచ్చినా పార్టీ తరఫున ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ… పార్టీతో ప్రయాణం చేసే ప్రతి కార్యకర్తకు భద్రత – భరోసా కల్పించేందుకే పవన్ కళ్యాణ్ క్రియాశీలక సభ్యత్వాన్ని తీసుకువచ్చారు. దురదృష్టవశాత్తు మృతి చెందిన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు ఆర్ధిక సాయంతో పాటు వారి బిడ్డల భవిష్యత్తుకు అండగా నిలిచే విధంగా కార్యచరణ రూపొందించారు. అంకితభావంతో సమాజం, ప్రజలకు ఉపయోగపడే ఏకైక పార్టీ జనసేన” అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీ, పార్టీ నాయకులు శెట్టిబత్తుల రాజబాబు, బండారు శ్రీనివాస్, గెడ్డం బుజ్జి, బోడపాటి శివదత్, సంగిసెట్టి అశోక్, వాసిరెడ్డి శివప్రసాద్, చొడిసెట్టి గణేష్ తదితరులు పాల్గొన్నారు.