‘ఆత్మ నిర్భర్ భారత్’ కార్యక్రమానికి వినాయక చవితి నుంచే శ్రీకారం: పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రజలంతా స్వదేశీ ఉత్పత్తులనే వాడాలని పిలుపునిచ్చారు. అంతేగాక, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘ఆత్మ నిర్భర్ భారత్’ అనే ఆలోచనను రూపొందించారని, దీని ముఖ్య ఉద్దేశం మన దేశీయ ఉత్పత్తులను వాడటం, ప్రోత్సహించడమేనని అన్నారు. దీని ద్వారా మన ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని వివరించారు. ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం ఒక వర్గానికో, ఒక ప్రాంతానికో సంబంధించినది కాదు. దేశ అభివృద్ధికి సంబంధించింది. మన దేశీయ వస్తువులు కొంటే మన దేశ ఉత్పత్తిదారులకు ఉపయోగపడుతుంది. ఆత్మ నిర్భర్ భారత్ అంటే మన ఉత్పత్తి,  మన ఉపాధి మరియు మన అభివృద్ధి అని పిలుపునిచ్చారు.

ఆత్మ నిర్భర్ భారత్ పై ప్రజలలో అవగాహన కల్పించి, వారిని భాగస్వాములను చేసేందుకు జనసేన, భారతీయ జనతా పార్టీలు సంయుక్తంగా ఈ వినాయక చవితి నుంచి కార్యక్రమాలు చేపడతాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. వినాయక చవితి నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి కారణం ఏమిటంటే మన దేశంలో ఏ పనైనా ప్రారంభించినప్పుడు విజయం కలగాలని విఘ్నేశ్వరుడికి తొలి పూజ చేసి మొదలు పెడతాం. అందుకే ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి వినాయక చవితి పర్వదినాన్ని ఎంచుకున్నామని పవన్ తెలిపారు.

ఈ వినాయక చవితికి మనం ఏదీ కొన్నా అది స్వదేశీ ఉత్పత్తా..? లేక విదేశీ ఉత్పత్తా అని చూడాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు అని జనసేనాని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.