యూరియా, డిఏపీ అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ఆత్మకూరు రైతాంగం: నలిశెట్టి శ్రీధర్

ఆత్మకూరు నియోజకవర్గంలో రైతాంగం యూరియా, డిఏపీ అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ పేర్కొన్నారు. గత రెండు సంవత్సరాలుగా వచ్చిన తుఫానులు మరియు వరదల కారణంగా నియోజకవర్గంలోని రైతాంగం పూర్తిగా నష్టపోయిందని, వారిని ఆదుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. గత రెండు సంవత్సరాల నుంచి వచ్చిన వరదల కారణంగా దెబ్బతిన్న సంగం మండలం కోలగట్ల గ్రామానికి చెందిన ఆక్వా రైతు పెంచల రెడ్డి, ఆక్వా పంట వరదలకు కొట్టుకుపోయి అప్పులపాలైన కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఇలా నియోజకవర్గ వ్యాప్తంగా, పెన్నా పరివాహక ప్రాంతంలో ఎందరో అన్నదాతలు సర్వస్వం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇలా మరో అన్నదాత తన ఉసురు తీసుకోక ముందే, వెంటనే ప్రభుత్వం స్పందించి, వరదల కారణంగా దెబ్బతిన్న ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లించాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. వరుసగా రెండు సంవత్సరాలు వరదల కారణంగా పంట నష్టపోయినప్పటికీ, తిరిగి రైతులు వ్యవసాయ పనులను మొదలు పెట్టారు. చెరువుల్లో నీరు పుష్కలంగా ఉన్న నేటి పరిస్థితుల్లో, సకాలంలో రైతులకు ఎరువులను అందించడంలో, ప్రభుత్వం విఫలమైందన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రధానంగా సిండికేట్ ఫార్మర్స్ కోపరేటివ్ సొసైటీ మరియు ప్రైవేట్ డీలర్ల ద్వారా రైతులకు ఎరువులు సరఫరా జరుగుతూ ఉండేది. ప్రస్తుత ప్రభుత్వ విధానాల కారణంగా ఎరువులు అందక రైతులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. డీలర్లకు ఎరువుల కేటాయింపుల విషయంలో దేశవ్యాప్తంగా ఒక విధానం ఉండగా మన రాష్ట్రంలో దీనికి భిన్నంగా ఉంది. రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు అమ్మడం కోసం ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రధాన సరఫరాదారులయిన సిండికేట్ ఫార్మర్స్ కోపరేటివ్ సొసైటీ మరియు ప్రైవేట్ డీలర్లకు కంపెనీల నుంచి ఇండెంట్ ప్రకారం ఎరువులు రాకుండా ఈ ప్రభుత్వం అడ్డుపడుతుంది. ఫార్మర్స్ కోపరేటివ్ సొసైటీలకు మరియు డీలర్లకు వ్యవసాయ శాఖ అనుమతితోనే కంపెనీలు, ఎరువులు సప్లై చేయాలన్న ప్రస్తుత ప్రభుత్వ విధానం వల్ల ఎరువుల కేటాయింపుల్లో, అధికారులు కోత విధిస్తున్నారు. ఎరువుల్లో అధికభాగం ఆర్బీకెల కే మళ్లిస్తున్నారు. కానీ ఆర్బీకేలలో అన్ని రకాల ఎరువుల లభ్యత లేకపోగా, సేంద్రియ ఎరువులు కొనుగోలు చేస్తేనే డీఏపీ, యూరియా, పొటాష్ లాంటి ఎరువులు ఇస్తామంటున్నారని రైతులు వాపోతున్నారు. దీనికితోడు గత సంవత్సరంతో పోలిస్తే ఎరువుల ధరలలో 30 నుండి 40 శాతం పెరుగుదల ఉంది. అసలే గత రెండు సంవత్సరాలుగా అకాల వర్షాలు, వరదలు, తుఫాను కారణంగా దెబ్బతిన్న రైతాంగానికి ఈ పెరుగుదల గోరు చుట్టు మీద రోకలి పోటుగా తయారయింది. ఇప్పటికైనా ప్రభుత్వం రైతన్నలు పడుతున్న ఇబ్బందులను గమనించి సకాలంలో రైతులకు ఎరువులు అందేలా సరఫరాను సరళతరం చేయాలని, ఎరువుల కొనుగోలుపై రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది.