చిలకలూరిపేట, జనచైతన్యమే జనసేన ఆశయమని, దగా పడ్డ పేదల పక్షాన నిలిచి వారి సమస్యలపై సాగించిన పోరుకు ఫలితంగానే జనసేన పార్టీకి అపూర్వ ఆదరణ లభిస్తోందని జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి చెప్పారు. ఆదివారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బాలాజి మాట్లాడుతూ పిఠాపురంలో ఈ నెల 14న నిర్వహించే జనసేన పార్టీ ఆవిర్భావసభ ప్రతి ఒక్కరికీ పండుగ రోజని, ఈ సభను విజయవంతం చేయటానికి ప్రతి జనసైనికుడు, వీర మహిళ శక్తి వంచన లేకుండా కృషి చేయాలని పిలుపు నిచ్చారు. జనసేన పార్టీ ఆవిర్బావమే ఒక ప్రభంజనమని, ప్రయాణం ఒక ప్రేరణ అని బాలాజి అభివర్ణించారు. ప్రత్యర్థుల విమర్శలను, ఇబ్బందులను సైతం లెక్కజేయక నిలబడి, కలబడి 100 శాతం విజయ బావుటా ఎగరవేసిన పార్టీ జనసేన అని పేర్కొన్నారు. పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా కదిలే లక్షలాది మంది సైన్యం జనసేన పార్టీ సొంతమని వెల్లడించారు. పార్టీ ఆవిర్బావంతోనే అట్టడుగు అభాగ్యులైన ప్రజలకు కల్లబొల్లి కథలు చెప్పి మోసగించే నేతలను నిలదీశారని, ప్రతి సమస్యపై ప్రశ్నించారని గుర్తు చేశారు. జనసేన పార్టీ ఆవిర్బావ సభ విజయవంతానికి 254 మందితో వేసిన 14 కమిటీలు ప్రజల్లోకి వెళుతున్నాయని తెలిపారు. పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేసి మరోసారి పార్టీ శక్తిని దేశానికి చాటుదామని బాలాజి పిలుపునిచ్చారు.
Share this content:
Post Comment