*ఆన్లైన్ మోసాలు, మద్యపానం ప్రమాదాలపై అవగాహన కలిగించిన ఎస్‌ఐ
పార్వతిపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలంలోని బొడ్లపాడు గ్రామాన్ని సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్.ఐ) జీ. కళాధర్ తన డిపార్ట్మెంట్ సిబ్బందితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ యువతతో మాట్లాడిన ఎస్ ఐ కళాధర్, సమాజాన్ని మేలుకొలుపు చేసే ముఖ్యమైన విషయాలపై విలువైన సూచనలు చేశారు. యువతకు మొబైల్ ఫోన్ల వాడకంపై హితబోధ చేస్తూ, “మీ ఫోన్లను మీ అభివృద్ధి కోసం మాత్రమే వినియోగించండి. వాటిని జీవితంగా మార్చుకోవద్దు. ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్ వంటి మాయలో పడి మోసపోకండి,” అని హెచ్చరించారు. అలాగే ఉద్యోగాల పేరిట డబ్బులు వసూలు చేసే మోసగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలని, అలాంటి అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే తాను ఎప్పుడైనా సహాయానికి సిద్ధంగా ఉంటానని భరోసా ఇచ్చారు.
ఇంకా పెద్దల విషయంలో మద్యపానం కుటుంబాలను నాశనం చేస్తుందని తెలియజేసి, తమ పిల్లలకు మంచి భవిష్యత్తును అందించాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రి మీద ఉందని వివరించారు. సైబర్ క్రైమ్, సెక్యూరిటీ, మరియు సురక్షిత ఆచరణలపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని ఆయన సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ కె. కృష్ణం నాయుడు, హెడ్ కానిస్టేబుల్ పి. కృష్ణం నాయుడు, జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా సంయుక్త కార్యదర్శి జనసేన జానీ, గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ పొన్నాడ శంకర్ రావు, గ్రామ వి.ఆర్.ఏ బండి రామప్పాడు, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. ఎస్.ఐ కళాధర్ చివరగా బొడ్లపాడు గ్రామ ప్రజలు చక్కగా సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
Share this content:
Post Comment