అర్హులందరికీ బీసీ బంధు ఇవ్వాలి

  • బీసీ బందును బి.అర్.ఎస్ బందుగా మార్చిన ఎమ్మెల్యేలు
  • ముదోల్ నియోజకవర్గంలో బిసి కుల వృత్తులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం తన అనుచరులకే కట్ట బెట్టిన ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి

భైంసా: భైంసా మండల పట్టణ కేంద్రాల్లో ప్రభుత్వం ప్రకటించిన బిసి బందు పధకంలో భాగంగా లక్ష రూపాయల కోసం గత కొద్ది రోజుల క్రితం ప్రజలు దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు పెట్టుకోమని అనేక పత్రాలు సమర్పించి, అతి తక్కువ సమయంలో హడావుడిగా రోజు వారి కూలి పనులు పక్కన పెట్టి దాదాపు ఒక్కొక్కరు వెయ్యి రూపాయల వరకు ఖర్చు పెట్టుకొని దరఖాస్తు చేసుకున్నారు. తీరా అది కాస్త అందరికీ వస్తుందనుకుంటే నాయకుల నీచ బుద్దిని చూపించారు. దొంగ చాటున వారి కార్యకర్తలను ఎంపిక చేసుకొని వారి అనుచరులతో చెక్కులు పంపిణీ చేశారు. కనీసం ప్రభుత్వ అధికారుల చేతుల మీదుగా ఇవ్వక పోవడం ఎంత వరకు సమంజసమని బిసి సంఘం నాయకులు సుంకెట పోషెట్టి, మాహాగం సర్పంచ్ రాకేష్, జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు అధికారులను ప్రశ్నించారు. ఈ సందర్భంలో బిసి కులాల ప్రజలు ఆగ్రహం కట్టలు తెంచుకొని రోడ్డుపై రాస్తా రోకో చేశారు. భైంసా పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద భైంసా – నిర్మల్ జాతీయ రహదారిపై బీసీ బంధు అందరికీ ఇవ్వాలని లబ్ధిదారులు ధర్నాకు దిగారు. భైంసా మండలంలోని మహాగాం గ్రామస్తులు, మహిళలు, పట్టణ రజక, మంగలి, వడ్డెర, మేర తదితర కుల వృత్తిదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ప్రతి ఒక్కరికి బీసీ బంధు ఇవ్వాలని, ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారులు బి.అర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే కు తొత్తుగా పనిచేస్తున్నారని ఆరోపణ చేశారు. మహగాం గ్రామంలో 195 దరఖాస్తులు చేస్తే ఒక్కరికే ఎలా ఇస్తారని నిలదీశారు. రాస్తారోకోతో రోడ్డుకు ఇరువైపులా నిలిచిన వాహనాలు, రాకపోకలకు అంతరాయం కలిగింది. రోడ్డుపై బైఠాయించిన నాయకులను పోలీస్, మండల పరిషత్ అధికారి, తహశీల్దార్ సముదాయించి కార్యాలయానికి వెళ్లి మాట్లాడి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి అందరికీ లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రాస్తా రోకో విరమించుకోవడం జరిగింది.