ఆన్‌లైన్‌ లావాదేవీలపై అప్రమత్తంగా ఉండండి: సిపి సజ్జనార్‌

ప్రస్తుతం టెక్నాలజీ పెరగడంతో అందరూ ఇళ్లల్లోనే, ఉన్న చోటు కదలకుండా నిమిషాల్లో తమ పనులను పూర్తి చేసుకుంటున్నారు. తమ పాత సామాన్లను కూడా ఓఎల్‌ఎక్స్‌లో పెట్టి అమ్మేస్తున్నారు. అయితే.. ఈ లావాదేవీల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలంటూ సైబరాబాద్‌ సిపి సజ్జనార్‌ ఓ వీడియో సందేశమిస్తున్నారు. తొందరపడి మోసపోవద్దని సిటిజన్లకు సూచిస్తున్నారు.

ఓఎల్‌ఎక్స్‌లో ఫోన్‌ అమ్మకానికి పెట్టినపుడు అవతలి వ్యక్తి..”మీ ఫోన్‌ కొంటానండి.. రూ.10 పంపుతాను. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి కన్ఫర్మ్‌ చేయండి” అంటాడు. తొందరపడి వారు చెప్పిందంతా చేస్తారు. ఫోన్‌ కట్‌ అయ్యాక మీ ఖాతాలోని నగదు అవతలి వ్యక్తి అకౌంట్‌లోకి వెళ్లినట్టు తెలుస్తుంది. తొలుత ఆందోళన చెందాల్సి ఉంటుంది. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించాల్సి వస్తుంది. ప్రస్తుతం ఆన్‌లైన్‌ మోసాలు పెరుగుతున్న క్రమంలో మోసగాళ్ల మాయలో పడొద్దని చెప్పేవిధంగా సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ ట్విటర్‌లో పోస్ట్‌ పెట్టారు. ఆన్‌లైన్‌ లావాదేవీలు జరిగేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని చెబుతూనే ఉన్నామని, ఇంకా చాలామంది ఆ ఉచ్చులో పడుతూనే ఉన్నారని అన్నారు. ఇప్పటికైనా తమ సూచనలను పాటించాలని ట్విటర్‌ వేదికగా కోరారు.