పలాస, జిల్లాలో సాగు నీటి సమస్యలను పరిష్కరించేందుకు, వృథాగా పోతున్న వర్షపు నీటిని నిల్వ చేయాలన్న లక్ష్యంతో చెక్‌డ్యామ్‌ల నిర్మాణం కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకుంటుందని జనసేన పార్టీ పలాస నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దుర్గారావు తెలిపారు. వజ్రకొత్తూరు మండలం బెండి, సీతాపురం, పెద్ద బొడ్డపాడు, కొండవూరు గ్రామాల ఎర్ర చెరువు మరియు రామ సాగర ఆయకట్టుకు నీరు అందించాలనే ఉద్దేశంతో డాక్టర్ దుర్గారావు, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ అభివృద్ధి కార్పొరేషన్ ఇంజినీర్లు, జనసేన నాయకులు, రైతులతో కలిసి బెండి గెడ్డ వద్ద చెక్‌డ్యామ్‌కు అనువైన ప్రాంతాలను పరిశీలించారు. బెండి గెడ్డ నుండి సముద్రంలో వృథాగా పోతున్న నీటిని నిలుపుకోవడం ద్వారా సాగు నీటి సమస్యలను పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, త్వరలో చెక్‌డ్యామ్ నిర్మాణానికి శ్రీకారం చుడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. చెక్కడ్యామ్ నిర్మాణం వల్ల అదనంగా నీరు నిల్వ ఉండి సుమారు 800 ఎకరాలకు సాగునీరు అందుతుందని, భూగర్భ జలాలు పెరుగుతాయని, గెడ్డలో నీటిని మోటార్ల సహాయంతో పంటలకు మళ్లించుకునే అవకాశాలు ఉంటాయని తెలిపారు. చెక్‌డ్యామ్ ఇరువైపులా గ్రావిటీ కాలువలను తవ్వి సాగునీరు అందించవచ్చని, ఇది వరద ముంపును కూడా తగ్గిస్తుందని వివరించారు. రైతు బిడ్డగా వంశధార ఎడమ కాలువకు నీరు అందించేందుకు చేసిన పోరాటాలే తన కృషికి నిదర్శనమని, చెక్‌డ్యామ్ ప్రాజెక్టును జిల్లా మంత్రి అచ్చన్నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళతానని డాక్టర్ దుర్గారావు చెప్పారు. ఈ కార్యక్రమంలో అర్జీ తులసీరావు, ఆనంద రావు, హనుమంతు శివకుమార్, తమ్మినాన బాలకృష్ణ, తమ్మినాన గోపాల రావు, మణిగాం తాతయ్య, తమ్మినాన తారకేశ్వర రావు, తమ్మినాన జయరాం, తమ్మినాన నరసింహా పాల్గొన్నారు.
Share this content:
Post Comment