బెంగాల్‌ నటుడు సౌమిత్రా ఛటర్జీ మృతి

బెంగాల్‌ సుప్రసిద్ధ నటులలో ఒకరైన సౌమిత్రా ఛటర్జీ (85) ఆదివారం మృతిచెందారు. ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కరోనా పాజిటివ్‌గా నిర్థారణైన ఆయనను గత నెల స్థానిక బెల్లె వ్యూ క్లినిక్‌ ఆస్పత్రిలో చేర్చారు. కరోనా చికిత్సలో భాగంగా ప్లాస్మాథెరపీని కూడా అందిచారు. ఆదివారం మధ్యాహ్నం 12-15 గంటలకు మరణించినట్లు వైద్య బృందం పేర్కొంది. ఆయనకు భార్య దీపా ఛటర్జీ, కుమార్తె పౌలోమి బసు, కుమారుడు సౌగతా ఛటర్జీ ఉన్నారు. ప్రముఖ దర్శకుడు సత్యజిత్‌ రే దర్శకత్వంలో 14 సినిమాల్లో నటించారు. భారత చిత్రసీమకు చేసిన సేవలకు గాను ఆయనకు 2004లో పద్మభూషణ్‌ అవార్డు లభించింది. 2012లో దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు అందుకున్నారు.

సౌమిత్రా ఛటర్జీ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతాపం తెలిపారు. నటనా రంగానికి సౌమిత్రా చటర్జి చేసిన సేవలు మరువలేనివని రాష్ట్రపతి తన ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు. సౌమిత్రా చటర్జి మరణం ద్వారా భారత సినీ పరిశ్రమ ఒక లెజెండ్‌ను కోల్పోయిందని.. సత్యజిత్‌ రే దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాల్లో సౌమిత్రా చటర్జి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకున్నారని రాష్ట్రపతి ట్వీట్‌ చేశారు.

బెంగాల్ నటుడు సౌమిత్రా ఛటర్జీ మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. సౌమిత్రా ఛటర్జీ మరణం ప్రపంచానికి పశ్చిమబెంగాల్, భారత దేశ సాంస్కృతిక రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ఛటర్జీ మరణంతో తనను తీవ్ర విచారంలో ముంచెత్తిందని ఆయన చెప్పారు. ఛటర్జీ కుటుంబానికి ఆయన సంతాపం తెలిపారు. కుటుంబసభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు.