బడుల విలీనంపై భగ్గు!

* రోడ్డెక్కిన తల్లిదండ్రులు, విద్యార్థులు
* రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ధ్వనులు
* ఉపాధ్యాయ సంఘాల వ్యతిరేకత
* మొండిగా ముందుకు సాగుతున్న వైసీపీ ప్రభుత్వం
* జగనన్న విద్యాకానుక ఇదేనా?

– పలక, బలపం, పుస్తకాలు బ్యాగులో సర్దుకుని బడికి వెళ్లాల్సిన విద్యార్థులు రోడ్లపై బైఠాయిస్తున్నారంటే ఏమిటి దానర్థం?
– పిల్లలను స్కూళ్ల దగ్గర దింపి టాటా చెప్పాల్సిన తల్లిదండ్రులు ఆందోళనతో నినాదాలు చేస్తున్నారంటే ఏమిటి దానర్థం?
– విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు ఎలుగెత్తి నిరసనలు చేస్తున్నారంటే ఏమిటి దానర్థం?
విద్యావ్యవస్థ నాశనమైందని అర్థం!
ప్రభుత్వ విధానాలు ఘోరంగా ఉన్నాయని అర్థం!!
సర్కారు మొండిగా వ్యవహరిస్తోందని అర్థం!!!
ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పుడదే జరుగుతోంది.
సెలవుల అనంతరం నవ్వు ముఖాలతో బడికెళ్లాల్సిన విద్యార్థులు బడులు తెరిచిన తొలి దినమే తెల్లబోయే పరిస్థితులు రాజ్యమేలుతున్నాయనడానికి రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల జరిగిన ఆందోళనలే సాక్ష్యం.
తల్లిదండ్రులు తల్లడిల్లుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయాల్సి వచ్చిన దుస్థితికి బడుల ముందు జరిగిన బైఠాయింపులే దర్పణం.
ఉపాధ్యాయ సంఘాలన్నీ మూకుమ్మడిగా నిరసిస్తున్న వాస్తవానికి టీచర్ల విమర్శలే నిదర్శనం.
జగన్ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న బడుల విలీనం నిర్ణయమే ఇంతటి సంక్షోభానికి కారణమైంది.
ఉపాధ్యాయులతో సంప్రదించకుండానే, విద్యాధికారుల సమక్షంలో చర్చలు జరపకుండానే, విద్యార్థుల ఇబ్బందులు పట్టించుకోకుండానే తల్లిదండ్రుల సాధకబాధకాలు పరిగణించకుండానే… మొండిగా ముందుకు సాగుతున్న ప్రభుత్వ విద్యావిధానాలే ఇంతటి ఆందోళనకు, విమర్శలకు దారితీసింది.
* అసలేంటీ విధానం?
నూతన విద్యా విధానం అంటూ జగన్ ప్రభుత్వం ఏకపక్షంగా అమలు చేసిన నిర్ణయాలు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో తీవ్ర గందరగోళాన్ని సృష్టించాయి. ఉపాధ్యాయుల హేతుబద్దీకరణ, పాఠశాలల విలీనం, జాతీయ విద్యా విధానం అనే పేర్లతో ప్రభుత్వం తీసుకున్న చర్యలు మొత్తం విద్యావ్యవస్థనే విచ్ఛిన్న చేసే విధంగా ఉన్నాయనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
గ్రామాల్లోను, పట్టణాల్లోను సాధారణంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉంటాయి. ఉన్నత పాఠశాలలకు 250 మీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలను విలీనం చేయాలని తొలుత నిర్ణయం తీసుకున్నారు. అలా ఒకటి నుంచి 5వ తరగతి వరకు ఉండే ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో కలుపుతారు. అలాగే ప్రాథమికోన్నత పాఠశాలల్లోని 6, ఆపై తరగతులను ఉన్నత పాఠశాల్లో కలుపుతారు. ఈ విలీనం వల్ల ఉపాధ్యాయుల పోస్టులు ఎక్కువగా ఉంటే వాటిని అవసరం ఉన్న చోటకు బదిలీ చేస్తారు. అయితే మొదట అనుకున్న 250 మీటర్ల దూరాన్ని ఆ తర్వాత 3 కిలోమీటర్లకు పెంచడంతో క్షేత్ర స్థాయిలో చాలా గ్రామాలు, ప్రాంతాల్లో ఉన్న అనేక బడులు దూరంగా ఉండే వేరే పాఠశాలల్లో విలీనం అయిపోయాయి. ప్రస్తుతం ఏపీలో 42,000 పాఠశాలలు ఉన్నాయి. ఈ విలీన ప్రక్రియ పూర్తిగా అమలు జరిగితే వాటి సంఖ్య 11,000 కు తగ్గిపోనుంది. అలాగే 6, 7, 8 తరగతుల్లో వంద మంది లోపు విద్యార్థులు ఉంటే వారిని 3 కిలోమీటర్ల దూరంలోని ఉన్నత పాఠశాలలో కలిపేస్తున్నారు. ఇప్పటికే 8,400కి పైగా పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులు తరలిపోయాయి. దాంతో ఇంతవరకు దగ్గర్లో ఉండే బడిలో చదువుకునే విద్యార్థులు ఇప్పుడు ఉన్నట్టుండి దూరంగా ఉండే స్కూళ్లకు వెళ్లాల్సి వచ్చింది. అలాగే పిల్లల్ని స్కూళ్ల దగ్గర దిగవిడిచే తల్లిదండ్రులకు కూడా దూరాభారం అధికమైంది. విద్యాధికారులు కేవలం కిలోమీటరు, రెండు కిలోమీటర్లు, మూడు కిలోమీటర్ల దూరమే కదా అని లెక్క చెబుతున్నా, ఒకో విద్యార్థి తన ఇంటి నుంచి బడికి వచ్చే దూరాలను పరిగణించడం లేదు. చాలా చోట్ల దగ్గర్లోని బడిలో చదువుకునే విద్యార్థులు ఇప్పుడు ఆయా ప్రాంతాలను బట్టి ఒకోచోట వాగులను, వంకలను, పెద్ద పెద్ద రహదారులను, రైల్వే గేట్లను, కాల్వలను, నిర్మానుష్యమైన ప్రదేశాలు కూడా దాటాల్సి వస్తోంది. క్షేత్ర స్థాయిలో ఉండే ఇలాంటి ఇబ్బందులను, సాధకబాధకాలను విద్యాధికారులు కానీ, జగన్ ప్రభుత్వ నేతలు కానీ పట్టించుకోకపోవడం తల్లిదండ్రులకు, విద్యార్థులకు అశనిపాతంగా మారింది.
దాని ఫలితంగానే ఇప్పుడు రాష్ట్ర వ్యప్తంగా ఆందోళలను జరుగుతున్నాయి. చాలా చోట్ల తల్లిదండ్రులు రోడ్లపై బైఠాయించారు. నినాదాలు చేశారు. రాస్తారోకోలు చేశారు. కోపోద్రేకాలు పట్టలేక పాఠశాలలకు తాళాలు కూడా బిగించారు. నిజానికి జాతీయ విద్యావిధానం బోధనా విధానాలు, కరిక్యులమ్లో కొన్ని మార్పులకు ఉద్దేశించినది. అయితే జగన్ ప్రభుత్వం ఆ పేరు చెప్పి పాఠశాలల సంఖ్యను తగ్గించుకోడానికి, ఉపాధ్యాయుల పోస్టులను మిగుల్చుకోడానికి చూస్తోందనే ఆరోపణలు, విమర్శలు తీవ్ర స్థాయిలో వినిపిస్తున్నాయి. దగ్గర్లో బడులు ఉంటే పేద వర్గాల వారు, బడుగులు తమ పిల్లల్ని పంపిస్తారని, దూరం పంపాల్సి వస్తే దూరాభారం వల్ల చాలా మంది పేద పిల్లలు చదువుకు దూరమవుతారనే విశ్లేషణ కూడా వినిపిస్తోంది. కానీ జగన్ ప్రభుత్వానికి మాత్రం ఈ విమర్శలు కానీ, ఆందోళనలు కానీ, ఆవేదనలు కానీ పట్టడం లేదు.
* ఇవిగివిగో విమర్శలు…
పాఠశాలలను విలీనం చేయడం వల్ల ఉపాధ్యాయ వర్గాల్లో కూడా గందరగోళం ఏర్పడుతోంది. ఎలాగంటే వేర్వేరు స్థాయుల్లో ఉండే పాఠశాలల పర్యవేక్షణ, అజమాయిషీ వేర్వేరు విద్యా శాఖలకు అనుసంధానమై ఉంటుంది. ఒక శాఖ అధీనం నుంచి మరో శాఖ అధీనంలోకి వెళ్లే ఉపాధ్యాయులు ఇంతవరకు అనుసరించిన ఉద్యోగ విధానాలు, జీతభత్యాలకు సంబంధించిన వ్యవహారాలు, బదిలీలు లాంటి మార్పులకు లోనుకావలసి ఉంటుంది. ఉదాహరణకు పురపాలక పాఠశాలలను పాఠశాల విద్యా శాఖలో విలీనం చేయడం, కొన్నింటిని జిల్లా పరిషత్తులో కలపడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయుల జీతాల బిల్లులు ఎవరు చేయాలి? పర్యవేక్షణ అధికారులుగా ఎవరు ఉండాలి? బోధనేతర సిబ్బంది పరిస్థితి ఏంటి?… లాంటి విషయాల్లో అయోమయం ఏర్పడుతుంది. అయితే జగన్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత, ఏకపక్ష, మొండి నిర్ణయాల వల్ల ఈ విషయంలో ఎవరికీ స్పష్టత ఏర్పడలేదు.
దాంతో ఉపాధ్యాయ సంఘాలన్నీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నాయి. “రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేస్తోంద”ని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అప్పారావు, వెంకట్రావు విమర్శిస్తున్నారు. “పాఠశాలల విలీనంపై జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టత లేద”ని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్, శ్రీరామ శెట్టి వెంకటేశ్వర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మండల విద్యాధికారుల కొరత ఉండడంతో ఒక్కొక్కరు రెండు మూడు మండలాలల పాఠశాలలను చూడాల్సి వస్తోందని, ఇందువల్ల సరైన పర్యవేక్షణ సాధ్యం కాదని విమర్శిస్తున్నారు. “ఇవి పాఠశాలల మూసివేత దిశగా అధికారులు చేస్తున్న ప్రయత్నాలే. వీటిని ప్రజలు అడ్డుకోవాలి. ఇప్పటికే రాష్ట్రంలో పలుచోట్ల ప్రజలు చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోదా?” అని ఏపీటీఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు మంజుల, భానుమూర్తి ధ్వజమెత్తారు.
* మేనమామ మాయ…
“పేదలు, బడుగులు చదువుకుని బాగు పడాలనేదే నా తపన. అందుకే మీ మేనమామగా మీకు జగనన్న విద్యా కానుకను అందిస్తున్నాను…” అంటూ ముఖ్యమంత్రి జగన్ ఘనంగా చెప్పుకుంటున్నారు. మరో వైపు పత్రికల్లో ఫుల్పేజీ ప్రకటనలతో విద్యాకానుక గురించి ప్రచారం చేసుకుంటున్నారు. పాఠ్యపుస్తకాలు, నోట్సులు, యూనిఫారాలు, బూట్లు, సాక్సులు, బెల్టు, నిఘంటువు తదితర వస్తువులతో కూడిన కిట్లను బడులు తెరిచిన తొలి రోజే విద్యార్థులకు అందిస్తున్నామని, ఇందుకు రూ.931 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని నిలువెత్తున రంగురంగుల ప్రకటనలు జారీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సమావేశాల్లో ముఖ్యమంత్రి జగన్ పిల్లల బుగ్గులు పుణికారు. ముద్దులు పెట్టుకున్నారు. స్కూలు బ్యాగు భుజాన వేసుకుని ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇదంతా ఘనంగానే ఉంది. కానీ ఆయా కిట్ల పంపిణీకి సంబంధించి క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే నివ్వెర పరిచే నిజాలు కనిపిస్తున్నాయి. అవేంటో చూద్దాం…
* కిట్లలో ఇస్తామన్న వస్తువుల్లో చాలా మటుకు లేవు. లేని వాటిని తర్వాత ఇస్తామని చెబుతున్నారు.
* అర్హులైన విద్యార్థుల్లో అందరికీ కిట్లు అందలేదు. తొలి రోజు చాలా చోట్ల 5 నుంచి 10 లోపు విద్యార్థులకే అందజేశారు. ఈ కిట్లను జారీ చేసే కాంట్రాక్టర్ల నుంచి పూర్థి స్థాయిలో సామగ్రి రాకపోవడమే కారణం.
* విద్యార్థులకు అందజేసిన బ్యాగుల నాణ్యత నాసిరకంగా ఉంది.
* యూనిఫారాలకు ఉపయోగ పడే వస్త్రాలతో పాటు వాటిని కుట్టించుకోడానికి కుట్టుకూలీ కూడా ఇస్తామనేది జగన్ వాగ్దానం. కానీ వాస్తవం పరిశీలిస్తే కిందటి సారి యూనిఫారలకు సంబంధించి దాదాపు 64 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. వాటిని ఆర్థిక ఇబ్బందుల వల్ల రద్దు చేశారు. దాంతో తల్లిదండ్రులే కుట్టుకులీ భరించాల్సి వస్తోంది. ఈసారైనా ఇస్తారనే నమ్మకం లేదు.
* ఇస్తామన్న పాఠ్యపుస్తకాలు కూడా పూర్తి స్థాయిలో రాలేదు.
వాస్తవాలు ఇలా ఉండగా జగన్ ప్రభుత్వం మాత్రం భారీ ప్రచారంతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తోందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇక ఈ ఏడాది 8వ తరగతిలో చేరే విద్యార్థులకు వచ్చే ఏడాది ట్యాబ్లు అందిస్తామనే మరో ప్రచారాన్ని ప్రభుత్వం చేసుకుంటోంది. అయితే గతంలో ల్యాప్ట్యాప్లు ఇస్తామన్న హామీకి మంగళం పాడిన నేపథ్యంలో ఈ ట్యాబ్ల పంపిణీ ప్రచారంపై కూడా చాలా మంది పెదవి విరుస్తున్నారు.
ఒకవైపు నూతన విద్యా విధానం పేరుతో భారీ ప్రచారం చేసుకుంటూ, మరో వైపు విద్యావ్యవస్థను గందరగోళంలో పడేసే ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, తల్లిదండ్రలు రోడ్లపై ఆందోళనలు చేసే పరిస్థితులు కల్పించడం… ఇదంతా “మేనమామ మాయ” తప్ప మరేదీ కాదనే విమర్శలు వినిపిస్తున్నాయి.