చిరంజీవికి భారతరత్న ఇవ్వాలి

  • కేంద్రాన్ని కోరిన చిరంజీవి అభిమానులు
  • ప్రజల కోరికా అదేనని వెల్లడి
  • రక్తదాన శిబిరంలో పెద్దఎత్తున పాల్గొన్న అభిమానులు

తనకు మాత్రమే సొంతమైన నృత్యాలతో, ఫైట్లతో అద్వితీయ నటనతో తెలుగు సినీపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొందటంతో పాటూ సామాజిక బాధ్యతతో ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టి తెలుగుజాతి కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా భారతరత్న ఇవ్వాలని చిరంజీవి యువత రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల రవీంద్రబాబు, జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి కోరారు. చిరంజీవి 67 వ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా చిరంజీవి యువత సీనియర్ అభిమానులు తిరుమల సాంబశివరావు, వీరిశెట్టి సుబ్బరావు, గుగ్గిళ్ల సురేష్ ల ఆధ్వర్యంలో చుట్టుగుంట సెంటర్లోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి వాళ్ళు ముఖ్యఅతిథిలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేకల రవీంద్రబాబు మాట్లాడుతూ.. సినీపరిశ్రమలో ఎవరి అండ, దండ లేకుండా స్వయంకృషితో ఉన్నతశిఖరాలు చేరుకొని ఎంతోమందికి స్ఫూర్తి దాతగా చిరంజీవి నిలుస్తున్నారని కొనియాడారు. ఆళ్ళ హరి మాట్లాడుతూ ప్రజలకి ఏ కష్టం వచ్చినా, తుఫాన్ లు, వరదలు వంటి విపత్తులు సంభవించిన మొట్టమొదట స్పంధించేది చిరంజీవే అన్నారు. కోవిడ్ సమయంలోనూ కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేశారని, అదేవిధంగా సినీపరిశ్రమలో పనిచేసే వర్కర్లకు నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేశారన్నారు. ఈ సంవత్సరం పుట్టినరోజు కానుకగా చిత్రపురి కాలనీలో పేదలకు ఉచితంగా వైద్యసేవలు అందించేందుకు ఆసుపత్రిని నిర్మిస్తున్నారని ఆళ్ళ హరి తెలిపారు. రాష్ట్ర చిరంజీవి యువత ఉపాదక్ష్యులు కంకణాల శంకర్ మాట్లాడుతూ… తెలుగు ప్రజల హృదయాల్లో చిరంజీవికి ఒక ప్రత్యేక స్థానం ఉందన్నారు. ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ చిరంజీవిని తమ కుటుంబ సభ్యుల్లో ఒకరుగా బావిస్తారన్నారు. అనంతరం పుట్టినరోజు కేకుని కట్ చేసి, రక్తదానం చేసిన ప్రతీ ఒక్కరినీ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తిరుమల సాంబశివరావు, వీరిశెట్టి సుబ్బారావు, గుగ్గిళ్ల సురేష్, నవబోతు తేజ, కంకణాల శంకర్, చింత శివ, బంధనం జ్యోతి, గిడుతూరి సత్యం, అనిత, పులిగడ్డ నాగేశ్వరరావు, జె బీ వై నాయుడు, అమ్మ శ్రీనివాస్, లెనిన్, బాషా, షర్ఫుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.