కేసీఆర్ సమీక్ష సమావేశానికి హాజరవుతున్న భట్టి విక్రమార్క

దళితబంధు పైలట్ ప్రాజెక్టు అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న సమావేశానికి తాను హాజరవుతున్నట్టు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో ప్రాజెక్టు అమలుపై ఈ సమావేశంలో చర్చించనున్నారని… మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం కూడా ఇందులో ఉందని… ఈ నేపథ్యంలో స్థానిక శాసనసభ్యుడినైన తనకు ఆహ్వానం అందిందని.. అందుకే సమావేశానికి తాను హాజరవుతానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తరపు డిమాండ్లను ఈ సమావేశంలో ప్రభుత్వం ముందు ఉంచుతానని అన్నారు.

ఈ అంశంపై ఈ ఉదయం నుంచి తమ పార్టీ నేతలతో చర్చించానని… సీఎం సమీక్ష సమావేశంలో ఏయే అంశాలను ప్రస్తావించాలనే దానిపై తమ నేతల నుంచి సలహాలను తీసుకున్నానని భట్టి విక్రమార్క తెలిపారు. ఈరోజు ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశానికి కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మధు యాష్కీ, శ్రీధర్ బాబు, పొదెం వీరయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.