ఒలింపిక్స్ కు అర్హత సాధించిన తొలి భారత ఫెన్సర్ గా భవాని దేవి ఘనత

ఒలింపిక్స్ లో అనేక ఏళ్లుగా పాల్గొంటున్న భారత్… ఇప్పటివరకు ఫెన్సింగ్ (కత్తి సాము) క్రీడాంశంలో మాత్రం అర్హత సాధించలేకపోయింది. అయితే ఆ లోటును తీర్చుతూ భారత మహిళా ఫెన్సింగ్ క్రీడాకారిణి భవానీ దేవి టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించింది. తద్వారా ఒలింపిక్స్ కు క్వాలిఫై అయిన తొలి భారత ఫెన్సర్ గా రికార్డు పుటల్లోకెక్కింది. ఈ మేరకు భారత ఫెన్సింగ్ సంఘం వెల్లడించింది. ఒలింపిక్ క్వాలిఫయింగ్ పోటీల్లో పాల్గొన్న భవానీ దేవి నిర్దేశిత ప్రమాణాలు అందుకోవడంతో టోక్యో ఒలింపిక్స్ బెర్త్ ఖరారు అయింది.

ఆసియా ఓషియానియా జోన్ నుంచి ఒలింపిక్స్ కు రెండు బెర్తులు కేటాయించగా, ఒకటి జపాన్ ఫెన్సర్ కైవసం చేసుకోగా, రెండోది భవానీ దేవి పరమైంది. భవానీ దేవి తమిళనాడుకు చెందిన ఫెన్సింగ్ క్రీడాకారిణి.

గతేడాది జపాన్ ముఖ్య నగరం టోక్యోలో నిర్వహించదలచిన ఒలింపిక్స్ కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. ఈ విశ్వక్రీడా సంరంభాన్ని ఈ ఏడాది ఆగస్టు 8 నుంచి టోక్యోలో నిర్వహించేందుకు జపాన్ ప్రభుత్వం ఘనమైన ఏర్పాట్లు చేస్తోంది. కరోనా వ్యాప్తి ఉద్ధృతమవుతున్నప్పటికీ తగిన జాగ్రత్తలతో ఒలింపిక్స్ నిర్వహించేందుకు జపాన్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.