బడుగుల నీడకు బడా సాయం!

* వైకాపా నిర్వాకాన్ని సరిదిద్దుతున్న కూటమి ప్రభుత్వం
* అసంపూర్తిగా మిగిలిన ఇళ్ల కోసం అదనపు మొత్తం
* ఎస్సీ, ఎస్టీ, బీసీల కుటుంబాల్లో సంబరం
* ప్రభుత్వ చేయూత విలువ రూ.3330 కోట్లు!

కల్లబొల్లి కబుర్లకీ… కార్యాచరణకీ మధ్య తేడా ఏంటో ఇప్పుడు తెలుస్తోంది…
ప్రచార పటాటోపానికీ… పని చేసే విధానాలకీ మధ్య అంతరం ఏంటో ఇప్పుడు బోధపడుతోంది…
వంచన చేసే తీరుకీ… బాధ్యత తీసుకునే నిబద్ధతకీ మధ్య వ్యత్యాసం ఎంతో ఇప్పుడు అర్థం అవుతోంది…
ఇదంతా అర్థం కావాలంటే ఏవేవో సర్వేలు గట్రా చేయక్కరలేదు…
గత ప్రభుత్వం హయాంలో నిరాశలో కూరుకుపోయిన 6.16 లక్షల కుటుంబాల్లో ఎవరిని కదిలించినా చాలు!
ఎందుకంటే… ఇప్పుడు వారి ముఖాల్లో సంబరం వెల్లివిరుస్తోంది…
వారి బతుకుల్లో ఆశా రేఖలు కనిపిస్తున్నాయి…
వారంతా బడుగులు…
నిలవడానికి సొంత గూడు కోసం తపించిన వారు…
ఎస్సీ ఎస్టీ బీసీ లాంటి వెనకబడిన తరగతుల వారు…
వట్టి మాటల వైకాపా ప్రభుత్వం హయాంలో ఐదేళ్ల పాటు నిలువ నీడ కోసం ఆశ పడినవారు…
‘నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు…’ అంటూ అప్పటి అధినేత పలికిన తీయని మాటల వలలో పడి వంచనకు గురై పరితపించిన వారు…
అలాంటి వారిని ఊరించి, మంజూరు చేసినట్టు ప్రచారం చేసుకున్న పక్కా ఇళ్లెన్నో వైకాపా నేతల నిర్లక్ష్యం, నిరాదరణ వల్ల అసంపూర్తిగా మిగిలిపోయాయి…
ఈ దశలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ పరిస్థితిపై దృష్టి సారించింది…
వేర్వేరు దశల్లో పనులు నిలిచిపోయిన ఆ ఇళ్ల పనులన్నింటినీ పూర్తి చేయడానికి నిర్ణయం తీసుకుంది!
ఇందుకోసం ఏకంగా 3330 కోట్ల రూపాయలను కేటాయించింది!
* ఏమిటా ఇళ్లు? ఎందుకీ సాయం?
కేంద్ర ప్రభుత్వ పధకాలైన ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన-పట్టణ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన- గ్రామీణ, పీఎం జన్‌మన్‌ పథకాల కింద దేశ వ్యాప్తంగా వేర్వేరు రాష్ట్రాల్లో అర్హులైన పేదల కోసం ఇళ్లు నిర్మించి ఇచ్చే వీలు ఉంది. లబ్దిదారుల ఎంపిక, నిర్మాణ కార్యక్రమం, పర్యవేక్షణలతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఆ పథకాలను ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇలా దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నిజమైన లబ్దిదారులకు నివాసాలు ఏర్పడ్డాయి కూడా. అయితే వైకాపా ప్రభుత్వం హయాంలో ఈ పథకాలు నత్తనడకన సాగాయి. ఏ కేంద్ర పథకాలున్నా వాటిని హడావుడిగా ప్రారంభించడం, పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం, ఆపై పట్టించుకోకపోవడం అలవాటుగా మారిన వైకాపా ప్రభుత్వం దాదాపు 6.16 లక్షల పేదల కుటుంబాలకు గూడు కల్పించే ఈ పనుల పట్ల కూడా నిర్లక్ష్యం వహించింది. కేంద్ర ప్రభుత్వం సాయం మినహా గ్రామీణ పేదలకు మరే విధంగాను సాయపడలేదు. పట్టణ ప్రాంతాల్లో మాత్రం రూ. 30 వేలు అందించి చేతులు దులుపుకుంది. అయితే కేంద్రం అందించే సాయం ఇళ్ల నిర్మాణాలకు సరిపోవడం లేదంటూ ఆ బడుగులు ఎన్ని సార్లు నేతలతో మొరపెట్టుకున్నా వైకాపా ప్రభుత్వం పెడచెవిని పెట్టింది. దాంతో ఈ పథకాల కింద చేపట్టిన దాదాపు 18.64 లక్షల ఇళ్ల నిర్మాణాలు వేర్వేరు దశల్లో కునారిల్లిపోయాయి. ఈ పథకాల కింద కేంద్ర ప్రభుత్వం ఇంటికి రూ. 1.5 లక్షలు కేటాయిస్తుంది. దీంతోపాటు ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మరో రూ. 30 వేలు మెటీరియల్ సాయంగా అందిస్తుంది. పట్టణ ప్రాంతాల్లోని ఇళ్లకు మాత్రం రూ.30 వేల చొప్పున అప్పటి జగన్ ప్రభుత్వం అందించి చేతులు దులుపుకుంది. అయితే ఈ సాయం సరిపోవడం లేదంటూ లబ్దిదారులు ఎంత మొత్తుకున్నా వైకాపా నేతలు పట్టించుకున్నది లేదు. దాంతో లక్షలాది మంది పేదల ఆశలు ఐదేళ్లుగా అణగారిపోయాయి.
వైకాపా హయాంలో 2019-24 మధ్య కాలంలో చేపట్టిన 18.64 లక్షల ఇళ్లలో 12.88 లక్షల ఇళ్లు అసంపూర్తిగానే మిగిలిపోయాయంటే గత ప్రభుత్వం నిర్వాకం ఎలాంటిదో ప్రత్యేకంగా ఏమీ చెప్పక్కరలేదు. దాదాపు 7.35 లక్షల గృహాలు వివిధ దశల్లో ఉండిపోయాయి. మరో 5.53 లక్షల ఇళ్లకు పునాది కూడా తీయలేదు.
* ఎవరెవరికి లబ్ది?
వివిధ దశల్లో ఉన్న 7.35 లక్షల ఇళ్లలో దాదాపు 2.58 లక్షల వరకు ఎస్సీ ఎస్టీ ఆదివాసీ లబ్దిదారులవని అంచనా. ఎస్సీలు 1.76 లక్షలు కాగా, వీరికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదనపు సాయం కింద ఒకొక్కరికి రూ. 50 వేలు వంతున మొత్తం రూ.880 కోట్లు వెచ్చించనుంది. ఎస్టీలు 30 వేల మంది ఉండగా ఒకొక్కరికి రూ. 75 వేలుగా వీరి కోసం మరో రూ. 225 కోట్లను కేటాయించనున్నారు. అలాగే ఆదివాసీ గిరిజనులు 44 వేల మందికి రూ. లక్ష వంతున మొత్తం రూ. 440 కోట్లను చెల్లించనున్నారు. ఇంకా 8,494 మంది చేనేత కార్మికులు ఉండగా రూ. 50 వేలు వంతున వారి కోసం రూ. 42.47 కోట్లను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇతర బీసీ వర్గాల వారు 3.5 లక్షల మంది ఉండగా వారికి కూడా రూ. 50 వేలు వంతున మరో రూ. 1750 కోట్లను విడుదల చేస్తారు. ఇప్పటికీ ఇళ్ల నిర్మాణం చేపట్టని కుటుంబాల వారు దాదాపు 5.53 లక్షల మంది ఉన్నారు. వీరు కూడా ముందుకు వస్తే వారికి సైతం సాయం అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
స్వర్ణాంధ్ర విజన్‌ లక్ష్యంలో భాగంగా 2029 నాటికల్లా రాష్ట్రంలో అర్హులందరికీ ఇళ్లు నిర్మించాలనే లక్ష్యంతో ప్రస్తుత ప్రభుత్వం పట్టుదలతో ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 9 నెలల్లోనే 1.25 లక్షల గృహాలను పూర్తి చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. మరో 7.35 లక్షల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో 3 లక్షల ఇళ్లను జూన్‌ నాటికి పూర్తి చేసేలా ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది.

Share this content:

Post Comment