నెల్లూరు: 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెల్లూరులో యోగాంధ్ర కార్యక్రమం భాగంగా ఆదివారం ఉదయం పతంజలి యోగ సమితి మరియు యోగ మిత్ర మండలి ఆధ్వర్యంలో యోగ అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా సెట్నల్ సీఈవో నాగేశ్వరరావు, డీఎస్డీ యతి రాజు హాజరై జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఎసీ సుబ్బారెడ్డి స్టేడియం నుండి గాంధీ బొమ్మ వరకు ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా క్రమశిక్షణతో యోగ నినాదాలతో ర్యాలీ సాగింది. అనంతరం స్వతంత్ర పార్కులో జరిగిన సభలో యోగ గురువులు, అధికారులు పాల్గొని విజయవంతమైన నిర్వహణకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఈవో నాగేశ్వరరావు మాట్లాడుతూ, ప్రధానమంత్రి మోదీ 10 సంవత్సరాల క్రితమే యోగ ప్రాధాన్యతను గుర్తించి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రారంభించారని, ప్రస్తుతం “యోగాంధ్ర” కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా 7,194 ప్రాంతాల్లో యోగ సాధన జరిగింది, దాదాపు 10 లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. భగవద్గీత బోధకులు నజీర్ భాష యోగ విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించగా, ప్రణవ యోగ కేంద్రం ఇంచార్జి చంద్రశేఖర్ యోగ ప్రాచుర్యానికి ప్రభుత్వ సహకారం అవసరమని అభిప్రాయపడ్డారు. విజయ్ కుమార్ రెడ్డి పతంజలి యోగ మాస్టర్ల పెరుగుదలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భావతీత ధ్యాన యోగ కేంద్రం ఇన్చార్జి ముత్యాల రవీంద్ర, పతంజలి యువ భారత్ జిల్లా ఇన్చార్జి కోటేశ్వరరెడ్డి, యోగ గురువులు అనిల్, పద్మ, నీరజతో పాటు అనేక మంది యోగ సాధకులు, శిక్షకులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment