ఎన్నికల ప్రచారంలో పద్మాదేవేందర్ రెడ్డికి చేదు అనుభవం

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ డిఫ్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. మంగళవారం ఆమె అల్వాల్ పరిధిలోని మచ్చ బొల్లారంలో ఇప్పుడున్న కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ తరుపున ప్రచారం చేశారు. ఆమెను కాలనీ వాసులు అడ్డుకున్నారు. తమ కాలనీలో మౌలిక వసతులు హామీ ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. గత ఎలక్షన్లలో మా సమస్యలు తీరుస్తామని టీఆర్ఎస్ నేతలు దేవాలయంలో ప్రమాణం కూడా చేశారన్నారు. తమకు వరద బాధితుల ఆర్థిక సాయం అందలేదని ఆందోళన వ్యక్తం చేశారు. డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ప్రమాణం చేసిన మైనంపల్లిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మీడియాను చూసి దేవేందర్ రెడ్డి మాట్లాడక వెళ్లిపోయారని చెప్పారు స్థానికులు. కాలనీలో మహిళలకు టాయిలెట్స్ బాత్రూమ్ లు లేవని మహిళలకు చాలా ఇబ్బంది కరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పద్మా దేవేందర్ రెడ్డి వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.