రియల్ హీరోపై బీఎంసీ ఫిర్యాదు.. బీజేపీ ఫైర్

లాక్ డౌన్ లో రియల్ హీరోగా మారి అనేకమంది నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచిన సోనూసూద్ ఇంటి ప్రాంగణానికి బృహన్ ముంబై కార్పోరేషన్ (బీఎంసీ) అధికారులు లాక్ వేశారు. సోనూసూద్ జుహూలోని శక్తిసాగర్ ఆరంతస్థుల భవనాన్ని సరైన అనుమతులు తీసుకోకుండా అక్రమంగా లాడ్జింగ్ కమ్ బోర్డింగ్ సౌకర్యాలతో హోటల్ గా మార్పులు చేసినట్టు బీఎంసీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. సోనూసూద్ మహారాష్ట్ర రీజియన్‌, టౌన్ ప్లానింగ్ యాక్ట్ ను ఉల్లంఘించారని ఓ సామాజిక కార్యకర్త జుహూ పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

అయితే ఈ విషయమై సోనూసూద్ మాట్లాడుతూ..తాను అక్రమంగా ఎలాంటి పనులు చేపట్టలేదన్నారు. అవసరమైన అనుమతులు తీసుకున్నానని, కేవలం మహారాష్ట్ర కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ నుంచి అనుమతి మాత్రమే రావాల్సి ఉందని చెప్పారు. మహమ్మారి సమయంలో కొవిడ్‌ యోధులను ఉంచేందుకు ఈ హోటల్ వినియోగించినట్లు తెలిపారు. అనుమతులు రాకపోతే, భవనాన్ని తిరిగి నివాసంగా మారుస్తానని చెప్పాడు.

సోనూసూద్ తన ఇంటి ప్రాంగణంలో లాడ్జింగ్ కమ్ బోర్డింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేసుకునేందుకు 2018 జూన్ లో బీఎంసీ పరిధిలోని కే-వెస్ట్ వార్డ్ బిల్డింగ్ ప్రపోజల్ డిపార్టుమెంట్ కు దరఖాస్తు చేశాడు. అయితే దీనిపై బీఎంసీ స్పందిస్తూ..అన్ని నిబంధనలు పాటిస్తూ సవరించిన ప్రతిపాదనలతో సమర్పించాలని సోనూసూద్ ను ఆదేశిస్తూ..సోనూసూద్ కు 2018 సెప్టెంబర్ లో దరఖాస్తును తిరిగిచ్చేసినట్టు తెలుస్తోంది. అది ప్రస్తుతం పెండింగ్ లో ఉందని సమాచారం.

మరోవైపు ఈ వ్యవహారంపై ప్రతిపక్ష బీజేపీ మండిపడ్డది. కంగనారనౌత్ పై తీసుకున్నట్టుగా సోనూసూద్ పై ఇలా చర్యలు తీసుకోవడాన్ని బీజేపీ తప్పుబట్టింది. అదే ప్రాంగణాన్ని బీఎంసీ గతేడాది క్వారంటైన్ సౌకర్యం కోసం ఉపయోగించిందని, ఇపుడు సడెన్ గా బీఎంసీ అక్రమం అంటూ పేర్కొటుందని ఆరోపించారు. ఇందులో ఎలాంటి తప్పు లేదు. ఓ ప్రముఖ వ్యక్తిని టార్గెట్ చేసేటపుడు బీఎంసీ కనీస అవగాహన కలిగి ఉండాలని ఆ పార్టీ నేత రామ్ కదమ్ విమర్శించారు.