దుర్గం చెరువులో బోటింగ్.. అధికారికంగా ప్రారంభించిన మంత్రులు

దుర్గం చెరువుపై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇటీవలే మంత్రి కేటీఆర్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కేబుల్ బ్రిడ్జి ను ప్రారంభించి హైదరాబాద్ వాసులకు అంకితం చేసిన విషయం తెలిసిందే. నిత్యం  సందర్శకుల సందడితో ట్రాఫిక్‌కు తీరని అంతరాయం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రతివారం శని, ఆదివారాలు వాహనాల రాకపోకలను బంద్ చేసి కేవలం పర్యాటకుల సందర్శనార్థం తెరిచి ఉంచుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా హైదరబాదీలకు తెలంగాణ టూరిజం మరో బ్రేకింగ్ న్యూస్ చెప్పింది.

దుర్గం చెరువులో బోటింగ్‌ను తెలంగాణ ప్రభుత్వం సోమ వారం అధికారికంగా ప్రారంభించింది. ఈ తెలంగాణ టూరిజం బోట్స్‌ను పర్యాటక శాఖామంత్రి శ్రీనివాస్ గౌడ్, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి తదితరులు ప్రారంభించారు. వీటిలో ఒక రెస్టారెంట్ బోట్, ఒక ఫ్లాట్ బోట్, ఒక స్పీడ్ బోట్, రెండు ఫెడరల్ బోట్స్ ఉన్నాయి. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఈ బోట్స్ పర్యాటకులకు అందుబాటులో ఉండనున్నాయి. కాగా, ఈ బోట్స్ రాకతో పర్యాటకుల సంఖ్య మరింతగా పెరిగనుంది. ఎంచక్కా బోట్లో విహరిస్తూ వంతెనను వీక్షించే అవకాశం వచ్చింది.