ఈనెల 14న బుమ్రా వివాహం..? అనుపమ కాదు.. సంజన!

న్యూఢిల్లీ: ఈ నెల 14న గోవాలో టీమిండియా పేస్‌ బౌలర్‌ జస్ప్రిత్‌ బుమ్రా పెళ్లి వేడుక జరగనున్నట్లు సమాచారం. అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, బుమ్రా పెళ్లి విషయమై గత కొన్ని రోజలుగా సోషల్‌ మీడియాలో విస్తృత చర్చ సాగుతోంది. దానికి కారణం.. వ్యక్తిగత కారణాల వల్ల బుమ్రా ఉన్నట్టుండి ఇంగ్లాండ్‌ టెస్ట్‌ నుంచి తప్పుకోవడమే. తనంతట తానుగానే బూమ్రా తప్పుకున్నాడని బిసిసిఐ చెబుతున్నప్పటికీ.. ఆ ‘వ్యక్తిగత కారణం’ వివాహమేనంటూ వార్తలు హల్‌చల్‌ చేశాయి. ఈ క్రమంలోనే ప్రముఖ హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ను బుమ్రా పెళ్లాడబోతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. అయితే, వీటిని అనుపమ తల్లి కొట్టిపారేశారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి బుమ్రా పెళ్లి వార్త ఆసక్తి రేపుతోంది. ప్రముఖ మోడల్‌, ఐపిఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ వ్యాఖ్యాత, స్పోర్ట్స్‌ యాంకర్‌ సంజనా గణేశన్‌తో బూమ్రా వివాహం ఖాయమైందంటూ తాజాగా రూమర్లు వినిపిస్తున్నాయి. నిత్యం స్పోర్ట్స్‌ ఈవెంట్లలో మునిగితేలే సంజన కూడా తన ఆఫీసులో ఎలాంటి కారణం చెప్పకుండా సెలవు పెట్టినట్లు సమాచారం.

కాగా, తమ వివాహ వేడుకను పూర్తి ప్రయివేటు కార్యక్రమంగా ఉంచేందుకు బూమ్రా, సంజన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. పెళ్లి వేడుకల్లో అతిథులు కనీసం ఫోన్‌ కూడా లోపలికి తీసుకెళ్లేందుకు అనుమతి లేదని తెలుస్తోంది. సంజన గణేశన్‌ 2014లో ‘మిస్‌ ఇండియా’ అవార్డు గెలుచుకుంది. ప్రముఖ ఎంటివి రియాలిటీ షో స్ప్లిట్స్‌ విల్లా 7వ సీజన్‌లో కూడా ఆమె కనిపించింది. ‘2012 ఫెమినా స్టైల్‌ దివా’లో కూడా చోటు దక్కించుకుంది.