అలక వీడిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి… రాజీనామా నిర్ణయం ఉపసంహరణ

టీడీపీలో గత కొన్నిరోజులుగా గోరంట్ల బుచ్చయ్యచౌదరి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పార్టీ అధినాయకత్వం గోరంట్ల వద్దకు రాయబారం పంపినా పెద్దగా పరిస్థితిలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి గోరంట్ల బుచ్చయ్య చౌదరిని బుజ్జగించడంతో సమస్య పరిష్కారం అయింది.

ఈ సాయంత్రం గోరంట్ల బుచ్చయ్య చౌదరితో చంద్రబాబు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో చర్చలు జరిపారు. చంద్రబాబుతో భేటీ ముగిసిన అనంతరం గోరంట్ల మీడియాతో మాట్లాడారు. ఇటీవల కొన్ని పరిస్థితుల నేపథ్యంలో తాను రాజీనామా చేయాలనుకున్న మాట వాస్తవమేనని వెల్లడించారు. అయితే, ఇప్పుడా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. పార్టీలో పరిణామాలను చంద్రబాబుకు వివరించి చెప్పానని, కార్యకర్తలు ఏమనుకుంటున్నారో ఆ విషయాలన్నీ ఆయనకు వెల్లడించానని గోరంట్ల తెలిపారు. ఎవరినో బెదిరించడానికి తాను అసమ్మతి గళం వినిపించలేదని, తాను ఏం చేసినా టీడీపీ కోసమేనని స్పష్టం చేశారు.

కాగా, భేటీ సందర్భంగా చంద్రబాబు తన పార్టీ నేత గోరంట్లకు పలు అంశాల్లో హామీ ఇచ్చారు. పార్టీ వ్యవహారాల్లో సముచిత గౌరవం ఇస్తామని, ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని పేర్కొన్నారు.