యుద్ధప్రాతిపధికన కాలువలు నిర్మించాలి: ఆళ్ళ హరి

గుంటూరు, ఏడు నెలల క్రితం కాలువలు పగలకొట్టారు. దీంతో ప్రజలు ఇళ్ళ ముందు పేరుకుపోయిన మురుగుతో దుర్గందాన్ని భరించలేక పోతున్నారు మరోవైపు దోమల కాటుతో విష జ్వరాలతో అల్లాడుతున్నారు. అయినా ఒక్క అధికారి కూడా ఇటువైపు కన్నెత్తి చూడలేదు, కమీషనర్ గారూ ప్రజలకు ఇంకెన్నాళ్ళీ నరకం అంటూ జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో లేకపోయినా ఇంకా వైసీపీ నేతల మాట విని ఇష్టానురీతిగా కాలువలు పగలగొట్టిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అయన కమీషనర్ పులి శ్రీనివాసులుని కోరారు. బుధవారం స్థానిక శ్రీనివాసరావుతోటలో జనసేన శ్రేణులతో కలిసి అయన పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలు ఏడు నెలలుగా తాము పడుతున్న బాధలను ఏకరువు పెట్టారు. భరించలేని దుర్వాసనతో, విపరీతమైన దోమలతో నరకయాతన పడుతున్నా ఒక్కరూ తమని పట్టించుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మలేరియా, టైఫాయిడ్ వంటి విష జ్వరాలతో అల్లాడుతున్నామన్నారు. దుర్వాసన పోవటానికి ఐదు నిముషాలకోసారి సానిటైజర్ జల్లుకుంటున్నామన్నారు. ఇళ్ళలోకి రాకపోకలు సాగించటం పెద్ద ప్రయాసగా మారిందన్నారు. ఇక వ్యాపారాలు సైతం సరిగ్గా సాగటం లేదని, రావటానికి దారి లేకపోవడంతో పాటూ విపరీతమైన దుర్గంధం వల్ల షాప్ కి ఎవరూ రావటం లేదని బాధని వ్యక్తం చేశారు. ఒక్క పది నిముషాలు అధికారులు ఇక్కడకి వచ్చి నిలుచుంటే మేము పడే బాధలు అర్ధమవుతాయని ప్రజలు ఆక్రోశం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ కార్పొరేషన్ అధికారుల్లో బాధ్యతా రాహిత్యం పెరిగిపోయిందని మండిపడ్డారు. ఏడు నెలలుగా ప్రజలు అల్లాడుతుంటే కనీసం పట్టించుకోవాల్సిన బాధ్యత అధికారులకు లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు పదే పదే చెబుతున్న పారదర్శకత, జవాబుదారీతనం అధికారుల్లో ఎక్కడా కనపడటం లేదని విమర్శించారు. ఏఈ, డిఈ, సంభందిత అధికారులు, సచివాలయం సిబ్బంది నిద్రపోతున్నారా అని దుయ్యబట్టారు. ఇప్పటికైనా యుద్ధప్రాధిపదికన కాలువలు నిర్మించాలని నగరపాలక సంస్థ అధికారులను ఆళ్ళ హరి కోరారు. ఈ కార్యక్రమంలో రెల్లి రాష్ట్ర నేత సోమి ఉదయ్ కుమార్, నగర కార్యదర్శి మెహబూబ్ బాషా, స్టూడియో బాలాజీ, నండూరి స్వామి, వడ్డె సుబ్బారావు, తోట సుబ్బారావు, స్థానికులు ధనలక్ష్మి, రమ, పువ్వాడ హరి, రాజు, చేబ్రోలు సాంబ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment