హెల్మెట్‌ లేకుండా పట్టుబడితే లైసెన్స్‌ రద్దు!

హైదరాబాద్ నగరంలో వాహనదారులకు ఇకనుంచి భారీ షాక్ తగలనుంది. హెల్మెట్ లేకుండా టూ వీలర్ వాహనం నడిపితే ఇకనుంచి కఠిన నిర్ణయాలు అమలుకానున్నాయి. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ద్విచక్రవాహనదారులకు జరిమానాతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ సైతం రద్దు అవుతుందంటున్నారు. మోటారు వాహనాల సవరణ చట్టం 2019, సెక్షన్ 206 (4) ప్రకారం హెల్మెట్ లేకుండా బండి నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని చెప్పారు. హెల్మెట్ వాడకంపై విస్తృతంగా ప్రచారం చేస్తున్న సైబరాబాద్ పోలీసులు లైసెన్స్ రద్దుకు సైతం వెళ్తామంటూ ద్విచక్ర వాహనదారులను హెచ్చరించారు.

హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతూ తొలిసారి దొరికితే మూడు నెలలపాటు లైసెన్స్ రద్దు చేయనున్నట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. రెండోసారి హెల్మెట్ లేకుండా దొరికితే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని చెప్పారు. రోడ్డు ప్రమాదాలలో ప్రాణ నష్టాలను నివారించేందుకు పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించినా కొందరిలో మార్పు రాకపోవడంతో కొత్త రూల్స్ అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.

నాణ్యమైన హెల్మెట్ ధరించి మీ ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు. కేవలం రూ.100 చలానా కట్టి వెళితే సరిపోతుందని ద్విచక్ర వాహనదారులు భావిస్తున్నారని, తాము ఆ వివరాలను ఆర్టీఓ అధికారులకు పంపిస్తామని హెచ్చరించారు. దీనివల్ల బైకర్స్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అవుతుంనది ఓ వీడియోను సైతం ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.