పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ

కాకినాడ సిటి: జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు & కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ ఆదేశాలతో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి పురస్కరించుకుని కాకినాడలో జనసేన పార్టీ 35వ డివిజన్ నాయకుడు మనోహర్ లాల్ గుప్త ఆధ్వర్యంలో రామక్రిష్ణారావు పేట పొట్టి శ్రీరాములు విగ్రహం నుండి సూర్యనారాయణపురం పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు పాదయాత్రగా ఘనంగా కొవ్వొత్తుల ర్యాలీ జరిపి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ శ్రేణులు మాట్లాడుతూ ఆనాడు 56 రోజులు కటిక నిరాహార దీక్ష చేస్తూ మరణం సంభవిస్తుందని తెలిసి కూడా ప్రాణత్యాగానికి వెరవకుండా ఆంధ్రరాష్ట్రం కావాలన్న ఒక్క సంకల్పంతో పోరాడిన వైనం తెలుగు ప్రజలు ఎవ్వరూ మరువలేనిది అన్నారు. అంతటి త్యాగంతో ఏర్పడిన రాష్ట్రానికి నేడు తన కుటిల రాజకీయం కోసం రాజధాని లేని స్థితిని ఏర్పరిచిన ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే మొత్తం పాపమన్నారు. మరి ఈ ముఖ్యమంత్రి అదే అమరావతిలో పేలెస్ కట్టుకుని పరదాలమాటున ఉంటూ రాష్ట్రాన్ని పాలిస్తున్నాడనీ, కూల్చడమే తప్ప రాజధానిని నిర్మించడం రాదని ప్రజలు భావిస్తున్నారన్నారు. అవినీతి సంపాదనతో దేశంలో అగ్రస్థానంలో ఉన్న ముఖ్యమంత్రికి ఆకలి విలువ, నిరాహారదీక్ష కసి మళ్ళీ ఆత్మత్యాగం నొప్పి ఎలా తెలుస్తుంది అని ప్రజల గుండెలు మండుతున్నాయన్నారు. రాజధాని కట్టాలంతే అందుకు డబ్బులు ఖర్చుపెట్టాలి అది తనకు అక్రమ సంపాదనకు అడ్డు అని, పధకాల పేరుతో అవినీతి సంపాదన కోసం రాజధాని నిర్మాణం ఆపారన్నారు. రాజధాని లేని రాష్ట్రం వైపు పారిశ్రామికవేత్తలు రాక అభివృద్ధి లేక ఎవరి కన్నూ తనమీద, తన అవినీతి సంపాదన మీద ఉండదు అని ఈ నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేసారు. నాటి నుండీ నేటి వరకు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అమరావతే రాజధాని అని చెపుతూ ఒకే మాట మీద నిలబడిందనీ, అందుకే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టొలో అమరావతే రాజధాని అని పేర్కొన్నాయన్నారు. అయిదు నెలల తరువాత అమరావతి రాజధానిగా పునర్నిర్మాణ మవుతుందనీ మన రాష్ట్రం రాజధాని కలిగిన రాష్ట్రంగా అవుతుందనీ ఆనాడే అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బాబు, తోరం చిరంజీవి, తుమ్మలపల్లి సీతారాం, శెట్టి జోగిరాజు, రమణ, షేక్ మొహిద్దిన్, బషీర్, అజారుద్దీన్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.