స్మశానాల్లో కనీస సౌకర్యాలు కల్పించలేరా..?

  • కనీస సౌకర్యాలు లేక పాడెక్కిన పార్వతీపురం స్మశాన వాటికలు
  • పార్వతీపురంలో దిక్కుకి ఒక్కదానికైనా కనీస సౌకర్యాలు కల్పించాలి
  • వర్షాకాలంలో స్మశాన వాటికల ఇబ్బందులు వర్ణనాతీతం
  • ఆ నలుగురు నడవలేని స్మశానాల రహదారుల దుస్థితి
  • పురపాలన పడకేసిందన్న జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం: మన్యం జిల్లా కేంద్రం పార్వతీపురం పట్టణంలోని స్మశాన వాటికల్లో కనీస సౌకర్యాలు కల్పించలేరా..? అని జనసేన పార్టీ నాయకులు ప్రశ్నించారు. ఆదివారం జనసేన పార్టీ జిల్లా నాయకులు వంగల దాలి నాయుడు, ఖాతా విశ్వేశ్వరరావు, గుంట్రెడ్డి గౌరీ శంకర్రావు, అన్నాబత్తుల దుర్గాప్రసాద్, కొల్లి వెంకటరావు, శంకరాపు రాకేష్, గున్నాన వినయ్ కుమార్, పైలా రాజు తదితరులు విలేకరులతో మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం పార్వతీపురం పట్టణముతో పాటు జిల్లాలోని ఆయా గ్రామాలు, మండల కేంద్రాలు, పట్టణాల్లో ఉన్న స్మశాన వాటికలో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. ముఖ్యంగా పార్వతీపురం పట్టణంలో బెలగాం, కొత్తవలస, జగన్నాధపురం, బైపాస్ రోడ్, చర్చ్ వీధి, ఎస్ ఎన్ పి కాలనీ, రెడ్డి వీధి చివర తదితర ప్రాంతాల్లోని స్మశాన వాటికల్లో కనీస సౌకర్యాలు లేక మృతదేహాలకు దహన సంస్కారాలు చేసేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్మశాన వాటికకు రాకపోకలు సాగించేందుకు రహదారి సదుపాయం లేక మృతదేహాలను తీసుకువెళ్లే ఆ నలుగురు నడిచేందుకు కనీస రహదారి లేక అవస్థలు పడుతున్నారన్నారు. ఇక వర్షాకాలం వస్తే మోకాలు లోతు బురదలో దిగి మృతదేహాన్ని తీసుకెళ్లాల్సిన దుస్థితి అన్నారు. అలాగే స్మశాన వాటికలో నీటి సదుపాయం, మృతదేహానికి దహన సంస్కారాలు చేసేందుకు అవసరమైన షెడ్డు, మృతదేహాన్ని తీసుకువచ్చిన ప్రజలు నిలుచేందుకు నీడ కోసం అవసరమైన షెడ్డు, ప్రహరీలు, గేట్లు తదితర సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇందులో కొన్ని కబ్జాలకు గురయ్యాయన్నారు. ఈ విషయమై పలుమార్లు సంబంధిత అధికారులు, పాలకుల వద్ద మొరపెట్టుకున్న ఫలితం లేదని ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ వద్ద వాపోయునట్లు జనసేన పార్టీ నాయకులు అన్నారు. పార్వతీపురం మున్సిపాలిటీలో పాలన అటకెక్కిందని అన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ నివాసం ఉండే బెలగాం ప్రాంతానికి చెందిన స్మశాన వాటికల పరిస్థితి కూడా అలాగే ఉందన్నారు. ప్రజలకు ఎలాగు కనీస అవసరమైన తాగునీరు అందించలేని దుస్థితిలో పురపాలన ఉందన్నారు. అలాగే మురుగు కాలువలు, రోడ్లు ఏర్పాట్లు కూడా అదే దుస్థితి అన్నారు. మనిషి చివరి ప్రయాణం చేసే స్మశాన వాటికలో సైతం కనీసం సౌకర్యాలు కల్పించలేని దుస్థితిలో మున్సిపల్ పాలన ఉందన్నారు. మున్సిపాలిటీలో ఉన్న అన్ని స్మశాన వాటికలో సౌకర్యాలు కల్పించ లేకపోయినా. కనీసం పట్టణంలో ఉన్న నాలుగు దిక్కులకు దిక్కుకి ఒకటి చొప్పున నాలుగు స్మశాన వాటికలో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. తక్షణమే సంబంధిత అధికారులు పాలకులు స్పందించి పార్వతీపురంలోని స్మశాన వాటికల్లో కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. లేని పక్షంలో జనసేన ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసైనికులు పాల్గొన్నారు.