పుష్ప’ టీంపై కేసు నమోదు

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందనున్న తాజా చిత్రం ‘పుష్ప’. అయితే ప్రస్తుతం ఈ సినిమా టీంపై సమాచార హక్కు సాధన స్రవంతి ప్రతినిధులు అదిలాబాద్ జిల్లా నేరడిగొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోవిడ్ రూల్స్ అతిక్రమించారని, తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కుంటాల జలపాతం సందర్శనకు అనుమతి లేకపోయినా.. అల్లు అర్జున్‌తో పాటు ‘పుష్ప’ టీం సభ్యులు మూడు రోజుల క్రితం సందర్శించడం జరిగిందని.. తిప్పేశ్వర్‌లో అనుమతి లేకుండా చిత్రీకరణ కూడా చేశారని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవులపల్లి కార్తీక్ రాజు తెలిపారు. కాగా, ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. ప్రాధమిక విచారణ చేసి కేసు నమోదు చేస్తామని అన్నారు.

ఈ నెల 13 న బన్నీ కుంటాల జలపాతంను సందర్శించి అక్కడి నుండి మహారాష్ట్రకు చేరుకున్న బన్నీ తిప్పేశ్వర్‌ అభయారణ్యంలో పర్యటించారు. ప్రస్తుతం బన్నీ పర్యటనకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి.