కుల గణన చారిత్రాత్మక ఘట్టం

*బీసీలకు న్యాయం జరిగే మార్గం సాఫీ అవుతోంది..

*జనసేన నేత ప్రేమ కుమార్

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన కుల గణన చారిత్రాత్మక నిర్ణయమని కూకట్‌పల్లి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ తెలిపారు. మోదీ ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ఈ కుల గణన ద్వారా సమాజంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలకు సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి, దేశ సామాజిక బలం బలోపేతం చేసే అవకాశం కలుగుతుందని అన్నారు. 1931లో బ్రిటిష్ ప్రభుత్వం నిర్వహించిన కుల గణన తర్వాత ఇప్పటివరకు షెడ్యూల్డ్ కులాలు, గిరిజనాల గణన తప్పించి ఇతర కులాలపై గణన జరగకపోవడం వల్ల అనేక వర్గాలకు సరైన విధానాలు రూపొందించడంలో అంతరాయం ఏర్పడిందన్నారు. 94 ఏళ్ల తర్వాత మోదీ ప్రభుత్వం ఈ ప్రక్రియను పారదర్శకంగా ప్రారంభించడం గొప్ప ముందడుగుగా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ కుల గణనపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయ నినాదంగా వాడినా, అధికారంలో ఉన్నప్పుడు మాత్రం పూర్తిస్థాయిలో చేపట్టడంలో విఫలమైందని విమర్శించారు. 2010లో యు పి ఏ హయాంలో కేవలం సర్వే మాత్రమే నిర్వహించి, డేటాను విడుదల చేయకపోవడం పారదర్శకత లోపమన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వాస్తవిక డేటా ఆధారంగా సంక్షేమ పథకాలు రూపొందించి సామాజిక న్యాయం అందించే దిశగా స్పష్టమైన దృష్టికోణంతో ముందుకెళ్తుందని పేర్కొన్నారు. కుల గణన ద్వారా అవసరమైన వర్గాలకు న్యాయమైన ప్రాతినిధ్యం, వనరుల పంపిణీ జరుగుతుందని అన్నారు. మోదీ ప్రభుత్వం 10% ఆర్థిక రిజర్వేషన్ అమలు చేసి సామాజిక సమరసతకు మార్గం వేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి, రాజకీయ స్వార్థాన్ని ప్రజల ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలూ దేశ నిర్మాణ దృష్టితో కుల గణన నిర్ణయానికి మద్దతివ్వాలని ప్రేమ కుమార్ కోరారు.

Share this content:

Post Comment