చాగలనాడు కాలువ మట్టి తరలింపు దారుణం: కందుల దుర్గేష్

  • ఇలాంటి ఘటనలను జనసేన, బిజెపి ఉపేక్షించవు

తూర్పుగోదావరి జిల్లా, చాగలనాడు ఎత్తిపోతల పథకం కాలువకు సంబంధించి రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని కోలమూరు దగ్గర కాలువ మట్టిని యథేచ్ఛగా తవ్వుకుని పట్టుకుపోవడం శోచనీయమని జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ విమర్శించారు. సోమవారం ఆ ప్రాంతాన్ని బిజెపి, జనసేన శ్రేణులతో కలిసి ఆయన సందర్శించారు. ఈసందర్బంగా అయన మాట్లాడుతూ ఇప్పటికే వందలాది లారీల మట్టిని తరలించుకుపోయారని, పైగా ప్రయివేట్ వెంచర్ లో పూడ్చుకోవడం దారుణమని పేర్కొన్నారు. ఇరిగేషన్ అధికారుల దృష్టికి ఎన్నిసార్లు ఈ వ్యవహారం తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ఇంకా యథేచ్ఛగా మట్టిని తవ్వేస్తుండడం దారుణమన్నారు. అలాగే పైప్ లైన్లు గల ఇరిగేషన్ స్థలంలో ప్రయివేట్ వ్యక్తికి సంబంధించి లారీలు వెళ్ళడానికి రోడ్డు వేసేశారని, దీనివలన పైప్ లైన్లు దెబ్బతింటాయని దుర్గేష్ పేర్కొన్నారు. అధికారులైనా, రాజకీయ నాయకులైనా సరే, ప్రజలకు అన్యాయం చేసే ఇలాంటి పనులు చేస్తే ఉపేక్షించబోమని జనసేన, బిజెపి హెచ్చరిస్తున్నాయన్నారు.