రేణిగుంట విమానాశ్ర‌యంలో చంద్ర‌బాబు నిర‌స‌న‌..

వైసీపీ ప్ర‌భుత్వ తీరును నిర‌సిస్తూ చిత్తూరులోని గాంధీ విగ్రహ కూడలిలో నిర‌స‌నకు టీడీపీ పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో నిరసన కార్యక్రమంలో పాల్గొన‌డానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోగా అక్క‌డ ఆయ‌న‌ను పోలీసులు అడ్డుకున్నారు. 

నిర‌స‌న‌కు అనుమతి లేద‌ని పోలీసులు చెప్పారు. దీంతో విమానాశ్ర‌యంలోనే నేల‌పై బైఠాయించి నిర‌స‌న తెలుపుతున్నారు. దీంతో రేణిగుంట విమానాశ్రయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెల‌కొంది. క‌రోనా‌ నిబంధనల కార‌ణంగా నిర‌స‌న‌కు అనుమ‌తి ఇవ్వ‌ట్లేద‌ని పోలీసులు అంటున్నారు.

టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి వ‌స్తున్నారు. చెప్పింది విన‌కుండా నిబంధనలు అతిక్రమిస్తే అదుపులోకి తీసుకుంటామని ఇప్ప‌టికే చంద్రబాబుకు రేణిగుంట పోలీసులు నోటీసులు జారీ చేశారు.

ఈ నేప‌థ్యంలో పోలీసుల‌పై చంద్ర‌బాబు నాయుడు మండిప‌డ్డారు. చంద్ర‌బాబుతో పాటు పీఏ, వైద్యాధికారి ఫోన్ల‌ను పోలీసులు తీసేసుకున్నారు. తాను క‌లెక్ట‌ర్ తో పాటు, తిరుప‌తి, చిత్తూరు ఎస్పీల‌ను క‌లిసి, త‌న ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకోవ‌డంపై విన‌తి ప‌త్రం ఇస్తాన‌ని పోలీసుల‌కు చంద్ర‌బాబు నాయుడు చెప్పారు.

అధికారుల‌ను క‌లిసేందుకు కూడా పోలీసులు అనుమతిని నిరాక‌రించారు. దీంతో అనుమ‌తి ఇవ్వాల్సిందేన‌ని చంద్ర‌బాబు నాయుడు ప‌ట్టుబ‌ట్టారు. అనుమ‌తి ఇచ్చేవ‌ర‌కు తాను బైఠాయించిన ప్రాంతం నుంచి క‌ద‌ల‌బోనంటూ పోలీసుల‌కు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఓ ప్ర‌తిప‌క్ష నేత‌గా క‌లెక్ట‌ర్, ఎస్పీల‌ను క‌లిసే హ‌క్కు కూడా త‌న‌కు లేదా? అంటూ మండిప‌డ్డారు.