కొత్త జిల్లాలలో మార్పులు చేయాలి

*కొత్త జిల్లాల ప్రకటనపై వైసీపీ వైఖరి ప్రజలకు తెలియజేయాలి
*మున్సిపల్ కౌన్సిల్ ‌ముట్టడికి అఖిలపక్షం హెచ్చరిక

రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల ప్రకటన నోటిఫికేషన్‌లో మార్పులు చేయాలి. ఎలాంటి ఆర్థిక వనరులు వెచ్చించకుండా, ప్రభుత్వానికి సంబంధించిన పరిపాల సౌలభ్యం కలిగిన భవనాలు కలిగిన మదనపల్లె కేంద్రంగా జిల్లా ప్రకటించాలి. ఆదివారం సాయంత్రం స్థానిక బుగ్గకాలువలోని ఎన్‌వీఆర్ కళ్యాణ మండపం ఆవరణంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో జనసేన గంగారపు రామదాస్‌చౌదరి, బాస్ పీటీఎం శివప్రసాద్, ఎమ్మార్పీఎస్ నరేంద్రబాబు, టీడీపీ దొరస్వామినాయుడు, సీపీఐ క్రిష్ణప్ప, జనసేన జంగాల శివరామ్‌ రాయల్ మాట్లాడారు. తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, పుంగనూరు నియోజకవర్గాల ప్రజల‌ మనోభావాలను దెబ్బతినక‌ ముందే, అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు మేల్కొని సీఎంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. మదనపల్లి జిల్లాగా ప్రకటించాలని పీలేరు, మదనపల్లి, తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గ మండల కేంద్రాల ఎంపీపీ, జడ్పీటీసీలు, గ్రామ పంచాయతీ సర్పంచులు మదనపల్లె జిల్లా కోసం తీర్మానం చెయ్యాలని, లేనిపక్షంలో మున్సిపల్ ఛైర్మన్, వైస్-ఛైర్మన్లు, జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసి, సర్పంచులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాల ప్రకటనలపై ఆయా ఎంపీ, ఎమ్మెల్యేలు స్పష్టమైన వైఖరిని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అన్ని వసతులు, భవనాలు, పరిపాలన సౌకర్యాలు కలిగి.. తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు, మదనపల్లె నియోజకవర్గాలకు అనుకూలంగా, అన్ని అర్హతలు కలిగిన మదనపల్లె జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాయచోటిలో తాగునీటికి దిక్కులేదు. రైల్వేలైన్, ప్రభుత్వ స్వంత భవనాలు లేని రాయచోటికి జిల్లా కేంద్రం తరలించడం దారుణం, అన్యాయం అన్నారు. మదనపల్లె జిల్లాకు కావాల్సిన అన్ని అర్హతలు కలిగి, పరిపాలన సౌలభ్యం కలిగిన మదనపల్లెను జిల్లాగా ప్రకటించేవరకూ రాజకీయ పార్టీలు, కులమత వర్గ విబేదాలు లేకుండా పోరాటాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 31న సోమవారం మదనపల్లె ‌మున్సిపల్ కార్యాలయంలో ఛైర్మన్ అధ్యక్షతన జరిగే కౌన్సిల్ సమావేశంలో మదనపల్లె జిల్లాగా ప్రకటించేందుకు తీర్మానం చేసే అంశం అజెండా పొందుపరచాలని, లేనిపక్షంలో కౌన్సిల్ సమావేశాన్ని అన్ని రాజకీయ పార్టీలు ప్రజా కులస‌ంఘాలు, ప్రజలతో కలసి అడ్డుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా సోమవారం నాలుగు నియోజకవర్గాల టీడీపీ, కాంగ్రెస్, జనసేన, బీఎస్పీ, సీపీఐ, బాస్, ఎమ్మార్పీఎస్, ప్రజా కులసంఘాలచే చర్చావేధిక సమావేశాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మదనపల్లె జిల్లాగా ప్రకటించే వరకు అన్ని రాజకీయ, ప్రజా కులసంఘాలతో కలసి ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీఎస్పీ, బాస్, ఎమ్మార్పీఎస్, సీపీఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.