సీక్వెల్ దిశగా చరణ్ ‘మగధీర’?

రాజమౌళి దర్శకత్వంలో చరణ్ హీరోగా వచ్చిన ‘మగధీర’ సంచలన విజయాన్ని సాధించింది. వసూళ్ల పరంగా కొత్త రికార్డులను సృష్టిస్తూ చరణ్ ను స్టార్ హీరోగా మార్చేసింది. ఇది పునర్జన్మలతో కూడిన ప్రేమకథే అయినప్పటికీ, రాజులు .. యుద్ధాల నేపథ్యంలో నడిచే కథలను రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించగలడనే నమ్మకం అప్పుడే ఆడియన్స్ కి కలిగింది. ఈ సినిమాకి సీక్వెల్ వస్తే బాగుంటుందని అప్పట్లోనే అనుకున్నారు. అప్పుడప్పుడు ఈ అంశం తెరపైకి వచ్చింది. ఇక ఆ సమయం ఎంతో దూరంలో లేదనే టాక్ ఇప్పుడు మళ్లీ వినిపిస్తోంది.

రాజమౌళి – చరణ్ ఈ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆలోచన చేసినట్టుగా ఒక వార్త జోరుగా షికారు చేస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ సెట్స్ పైనే ఈ ఆలోచన బలపడిందని అంటున్నారు. ప్రస్తుతం చరణ్ తమిళ దర్శకుడు శంకర్ తో ఒక పాన్ ఇండియా మూవీ చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక రాజమౌళి కూడా తదుపరి సినిమాను మహేశ్ బాబుతో ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయిన తరువాత ‘మగధీర’ సీక్వెల్ ఉంటుందని అంటున్నారు.