ఆ డ్రగ్స్‌ రియావే.. చాట్ చేశా కానీ డ్రగ్స్ తీసుకోలేదు..

డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రకుల్ ప్రీత్ సింగ్..నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ విచారణలో కొత్త కొత్త విషయాలు వెల్లడించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ కథనాల ప్రకారం.. ముంబైలోని రకుల్‌ ఇంటి నుంచి ఎన్‌సీబీ అధికారులు గురువారం డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం నాలుగు గంటలపాటు సాగిన విచారణలో ఇదే అంశంపై రకుల్‌ను అధికారులు ప్రశ్నించగా.. ఆ డ్రగ్స్‌ సుశాంత్‌ సన్నిహితురాలు, నటి రియా చక్రవర్తికి చెందినవని రకుల్‌ చెప్పినట్టు సమాచారం. డ్రగ్స్‌ సరఫరాకు రియా తన ఇంటిని వాడుకునేదని అధికారులకు రకుల్‌ వెల్లడించినట్టు తెలుస్తున్నది. అయితే, డ్రగ్స్‌ దొరికినట్టు చెబుతున్న నివాసం నిజానికి తన ఇల్లు కాదని రకుల్‌ ఈ సందర్భంగా అధికారులతో చెప్పినట్టు సమాచారం. మరోవైపు, డ్రగ్స్‌కు సంబంధించి తనకు, రియాకు మధ్య చాటింగ్‌ జరిగినట్టు రకుల్‌ ఒప్పుకున్నట్టు మీడియా వెల్లడించింది. అయితే, తానెప్పుడూ డ్రగ్స్‌ తీసుకోలేదని, డ్రగ్స్‌ సరఫరా చేసే వ్యక్తులతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె పేర్కొన్నట్టు తెలిసింది. డ్రగ్స్‌ వ్యవహారంలో సమన్లు అందుకున్న నటి దీపికా పదుకొనె, మరో నటి సారా అలీఖాన్‌ శనివారం ఎన్‌సీబీ ఎదుట విచారణకు హాజరుకానున్నారు.