బాలు మృతికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్ సంతాపం..

ముఖ్యమంత్రి కేసీఆర్

గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాలు కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాలు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది అని పేర్కొన్నారు. ఎన్నో సుమధుర గేయాలు పాడి ప్రజల అభిమానం సంపాదించారు అని గుర్తు చేశారు. గాయకుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా సేవలు అందించారని సీఎం పేర్కొన్నారు.

సినీ గాయకుడు శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం పట్ల సీఎం శ్రీ కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్నో సుమధుర గేయాలు ఆలపించిన శ్రీ బాలు భారతీయ ప్రజలందరికీ అభిమాని అయ్యారని అన్నారు. ఆయన ప్రాణాలు కాపాడడానికి డాక్టర్లు చేసిన కృషి విఫలం కావడం దురదృష్టకరమన్నారు.

ముఖ్యమంత్రి జగన్

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరన్నవార్త దిగ్భ్రాంతికి గురిచేసిందని ఏపీ సీఎం జగన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. “గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరన్నవార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. 16 భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను” అంటూ ట్వీట్ చేశారు.

గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి తీవ్ర దిగ్ర్భాంతి కలిగించిందని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తెలుపుతూ ట్వీట్ చేశారు. ఆయన మృతి చెందారని తెలిసి తీవ్ర షాక్‌కు గురైనట్టు తెలిపారు. గాయకుడిగా, సంగీతకర్తగా, నటుడిగా ఆయన ఎంతో ప్రతిభను కనబర్చారని పేర్కొన్నారు. ప్రజల గుండెల్లో బాలు, ఆయన పాటు చిరస్థాయిగా నిలిచి ఉంటాయని అన్నారు. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మృతి జాతికి ముఖ్యంగా సంగీత ప్రపంచానికి తీరని లోటని గవర్నర్‌పేర్కొన్నారు. ఈసందర్భంగా గవర్నర్‌ తమిళిసై బాలు కుటుంబానికి, ఆయన అభిమానులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.