తెలుగుజాతి కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు చిరంజీవి

గుంటూరు, ఒక సామాన్య కుటుంబంలో జన్మించి స్వయంకృషితో ఉన్నత శిఖరాలు అధిరోహించి, తన జీవితం ద్వారా ఎంతోమందికి స్ఫూర్తినిస్తూ, మానవతావాదిగా, సేవాతత్పరుడిగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజల హృదయాల్లో కొలువుండి, తెలుగుజాతి కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి అని గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. సోమవారం చిరంజీవి 67వ పుట్టినరోజు సందర్భంగా శ్రీనివాసరావుతోటలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ… మూడు దశాబ్దాల క్రితం ఒక మూసలో వెళ్తున్న తెలుగు సినిమాకి తనకు మాత్రమే సొంతమైన నృత్యాలతో, ఫైట్లతో సమ్మోహన పరిచే అద్వితీయమైన నటనతో తెలుగు సినిమా గతిని, రీతిని మార్చిన అసమాన్య నటుడు చిరంజీవి అని కొనియాడారు. తాను నెలకొల్పిన రికార్డులను తానే తిరగరాసుకుంటూ మూడు దశాబ్దాలకు పైగా తెలుగు చిత్రపరిశ్రమలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న మేరునగధీరుడు మెగాస్టార్ చిరంజీవి అని అన్నారు. ఇక చిరంజీవిలో ఉన్న మానవతాకోణం ఎంతోమంది జీవితాలను నిలబెట్టిందన్నారు. రక్తదానం, నేత్రదానం వంటి బృహత్తరమైన కార్యక్రమాలతో లక్షలాదిమందికి ప్రాణదానం చేసిన ఘనత ప్రపంచ సినీ చరిత్రలో చిరంజీవికి, ఆయన అభిమానులకు మాత్రమే దక్కుతుందన్నారు. దోసిట సంపాదించి గుప్పెడు దానం చేసే చిరంజీవి దాతృత్వం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్నారు. సినీపరిశ్రమలోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ ఎవరికి ఏ కష్టం వచ్చినా, తుఫాన్, సునామీ వంటి ప్రకృతి విపత్తులు సంభవించిన మానవత్వంతో స్పంధించే మొదటి గుండె చిరంజీవిదేనన్నారు. తాను సాయం చేయటమే కాకుండా కోట్లాదిమంది తన అభిమానుల్ని సైతం సేవాకార్యక్రమాల్లో భాగస్వామ్యుల్ని చేసి సమాజంలో వారికొక సమున్నతస్థానాన్ని కల్పించిన మహనీయుడు చిరంజీవన్నారు. చిన్న చిన్న విజయాలకే పొంగిపోతూ అహంకారంతో విర్రవీగుతున్న నేటి ప్రపంచంలో ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే ఆయన వ్యక్తిత్వాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. చిరంజీవి అభిమానిగా చెప్పుకోవడం తామందరికీ గర్వకారణమని, చిరంజీవి చూపించిన సేవా మార్గంలో పయనిస్తూ సమాజానికి తమవంతు సేవలందిస్తామని ఆళ్ళ హరి అన్నారు. కార్యక్రమంలో చెన్నా పోతురాజు, కోలా అంజి, మిరియాల శ్రీనివాస్, శేషు, సహారా సుభాని, షర్ఫుద్దీన్, దాసరి రాము, వెంకటేశ్వరరావు, చిరంజీవి, ప్రసాద్, తిరుపతిరావు, సాయి, వీరిశెట్టి సుబ్బారావు, జెబీయై నాయుడు, గోపి, గుగ్గిళ్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.