ఆక్సిజన్ కొరత పై చిరంజీవి ఆందోళన.. విశాఖ ఉక్కుపై సంచలన ట్వీట్‌

కరోనా కేసులు విస్తృతంగా నమోదవుతున్న నేపథ్యంలో… పేషెంట్లకు ఆక్సిజన్ కూడా దొరకని పరిస్థితి దేశ వ్యాప్తంగా నెలకొంది. ఈ పరిస్థితిపై ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా ఆయన స్పందిస్తూ… ఆక్సిజన్ దొరక్క దేశ వ్యాప్తంగా కరోనా పేషెంట్స్ అల్లాడిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈరోజు ఒక స్పెషల్ రైలు విశాఖ ఉక్కు కర్మాగారానికి చేరుకుందని… అక్కడి నుంచి 150 టన్నుల ఆక్సిజన్ ను మహారాష్ట్రకు తీసుకెళ్తుందని చిరంజీవి చెప్పారు. ఇప్పుడున్న అత్యవసర పరిస్థితిలో ఎన్నో రాష్ట్రాలకు ఆక్సిజన్ అందించి, ఎంతోమంది ప్రాణాలను ఆ రైలు కాపాడుతుందని తెలిపారు. ఇంత గొప్ప పని చేస్తున్న విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో ఉందని చెపుతూ…  విశాఖ ఉక్కు రోజుకు 100 టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి చేస్తోందని, కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడుతోందని అన్నారు. అలాంటి విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలనుకోవడం ఎంతవరకు సబబు? అని చిరంజీవి ప్రశ్నించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకూ ఇక్కడి నుంచే ఆక్సిజన్‌ అందుతోందని ఆయన ట్వీట్‌ చేశారు. ప్రైవేటీకరణ విషయంపై మీరే ఆలోచించాలని కేంద్రానికి సూచించారు.